CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్‌ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొన్ని స్థానాల్లో కూటమి పార్టీలకు తలనొప్పి తప్పడం లేదు.. ఇక, ఇవాళే నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో.. కూటమి లీడర్లు అంతా.. రెబల్స్‌ను నామినేషన్‌ విత్‌డ్రా చేసుకునే విధంగా బుజ్జగిస్తున్నారు.. అయితే, పార్టీ రెబల్‌ అభ్యర్థులకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక జారీ చేశారు. రెబల్స్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కూటమి పార్టీలు మరోసారి ప్రజల ఆశీర్వాదాన్ని పొందాలని నేతలకు సూచించారు చంద్రబాబు.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య మిత్రధర్మాన్ని పాటించాలని, క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. జనసేన, బీజేపీ అధికారిక అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లోనూ రెబల్‌ అభ్యర్థులు బరిలో లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రెబల్స్‌ నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలి
పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేలా చూడాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. నామినేషన్లను ఉపసంహరించుకోని వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. కూటమి అభ్యర్థుల విజయానికి ఆటంకం కలగకుండా నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా చంద్రబాబు చర్చించారు. టికెట్లు దక్కని ఆశావహులు నిరాశ చెందవద్దని, అర్హులైన వారికి నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే సామర్థ్యం ఉన్న మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సూచించారు.

సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన ప్రచారాంశాలుగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు చేసిన పనులను వివరించడంతో పాటు, కూటమి పార్టీల మధ్య ఐక్యతను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. రెబల్‌ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించి, అధికారిక అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..