CM Chandrababu: కేబినెట్‌ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?

Cbn

Cbn

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం మంత్రులతో పలు కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబు.. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన, అమరావతి రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, పర్యాటకం, హార్టికల్చర్ హబ్ వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను మంత్రులకు వివరించారు.

డీలిమిటేషన్ ఏపీకి మంచి అవకాశం
నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్‌కు మంచి అవకాశమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపారు. ఈ విధానం అన్ని రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని ఆహ్వానించినట్లు చంద్రబాబు మంత్రులకు తెలిపారు. పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించారని చెప్పారు. ఈ నెల 29 నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు, కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీలంతా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు.. రేపు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కార్యక్రమానికి హాజరవుతానని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు.

అమరావతిపై విషప్రచారం చేస్తున్నారు
అమరావతి రాజధానిపై గొడ్డలి పార్టీ విషప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)లకు ఫిర్యాదులు చేస్తూ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను కూడా హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి కోసం రైతులు చేసిన పోరాటానికి గుర్తుగా స్మారక నిర్మాణం చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించారు. దీనికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. రైతుల త్యాగాలు, ఉద్యమ చరిత్ర భావితరాలకు తెలిసేలా స్మారకం నిర్మించాలనే ఆలోచనను సమర్థించారు.

డిసెంబర్ 1న హార్టికల్చర్ హబ్ ప్రారంభం.. రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చంద్రబాబు తెలిపారు. డిసెంబర్ 1న హార్టికల్చర్ హబ్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రులకు వెల్లడించారు. ఈ కార్యక్రమం సమర్థంగా అమలయ్యేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి, సీఈవోను నియమించనున్నట్లు చెప్పారు. ఉద్యానవన రంగంలో రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇక, విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక రంగానికి ఉపయోగించుకోవాలని కేబినెట్ సబ్‌కమిటీ సూచించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారా ఖర్చులు ప్రజలకు తెలియాలంటే ప్యాలెస్‌ను సందర్శనకు అందుబాటులో ఉంచాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దీనిపై వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

పెట్టుబడుల రక్షణ చట్టంపై కీలక లక్ష్యం
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం పెట్టుబడుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ చట్టాన్ని జనవరి నాటికి ఆమోదించి, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా ఈ చట్టం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల ప్రారంభం, పూర్తికి సంబంధించి స్పష్టమైన క్యాలెండర్ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేవలం ఒప్పందాలు చేసుకోవడంతో సరిపెట్టుకోకుండా, పరిశ్రమల నిర్మాణం ప్రారంభించి, వాటిని పూర్తిచేసి కార్యకలాపాలు మొదలుపెట్టే వరకు నిర్దిష్ట కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మొత్తంగా మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలు, రాజధాని నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, పర్యాటక రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.