CM CBN @ 30 Years: తెలుగు నేలపై సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు ఎందరో ఉండొచ్చు.. కానీ, దీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతూ.. ముఖ్యమంత్రిగా కూడా రికార్డులు సృష్టించిన నేత ప్రస్తుత నవ్యాంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు తన రాజకీయ జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. సీబీఎన్ మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.. ఆయన 1995 సెప్టెంబర్ 1వ తేదీన తొలిసారిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఈ సుదీర్ఘ నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులను.. ఎత్తుపల్లాలను చూసిన ఆయన.. ఎన్నో ఆరోపణలు, విమర్శలకు కూడా ఎదుర్కొన్నారు..
అయితే, తన రాజకీయ జీవితంలో మరో మైలు రాయిని చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. టీడీపీ నేతలు.. “తెలుగు నేల గర్వించే నాయకుడు.. తెలుగు రాష్ట్రాల ప్రగతి కారకుడు.. దేశం స్మరించే దార్శనికుడు.. యువతకు భవిష్యత్తు చూపిన మార్గదర్శి.. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్ళిన ఆద్యుడు.. పేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు.. మన చంద్రబాబు నాయుడు..” తొలి సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రజా సంకల్పమే శ్వాసగా, రాష్ట్ర ప్రగతినే లక్ష్యంగా పెట్టుకున్న విజనరీ నేతకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న..
ఇక, మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ.. 30 సంవత్సరాల క్రితం ఈరోజు, చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఆంధ్రప్రదేశ్ ఆశయాలకు అనుగుణంగా.. అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేసే యుగం ప్రారంభమైంది. పాలనను సాంకేతికతతో సమకూర్చడం నుండి పెట్టుబడి మరియు ఉద్యోగాలను ఉత్ప్రేరకపరచడం వరకు, ఈ ప్రయాణం అవకాశాలను వాస్తవికతగా.. ఆకాంక్షలను మన్నికైన సంస్థలుగా మార్చడం గురించి. హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ.. కొత్త సాంకేతిక గుర్తింపును శక్తివంతం చేయడం నుండి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పట్టణీకరణను నిర్మించాలనే మన సంకల్పాన్ని సూచించే అమరావతి వరకు, ఆయన నాయకత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాల కల్పన.. ‘CBN ప్లేబుక్’ వేగాన్ని జవాబుదారీతనం, స్థితిస్థాపక మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా ఆధారిత సేవలు, పౌరులు మరియు సంస్థలను ఒకే విధంగా శక్తివంతం చేసే వేదికలతో మిళితం చేసింది. పేదరిక నిర్మూలన పథకాలు మరియు రిజర్వేషన్ విధానాలను సృష్టించడం ద్వారా, చంద్రబాబు పదవీకాలం సామాజిక న్యాయం మరియు బలహీనుల సాధికారతలో గణనీయమైన మెరుగుదలతో గుర్తించబడిందని పేర్కొన్నారు లోకేష్..
కాగా, తెలుగుదేశం పార్టీ.. 1994 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ స్థానంలో నారా చంద్రబాబు టీడీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఇక, సెప్టెంబర్ 1వ తేదీ 1995న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన.. విద్యార్థి దశ నుంచే రాజకీయాలవైపు అడుగులు వేశారు.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరి.. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థానానికి వెళ్లారు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పరిపాలనలో వినూత్న సంస్కరణలను ప్రారంభించిన చంద్రబాబు.. పీపుల్స్ గవర్నమెంట్, జన్మ భూమి, శ్రమదానం.. వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశారు.. టెక్నాలజీ పట్ల తన దార్శనికతతో, హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాది పడేలా చేశారు.. ఇది ఐటీ రంగంలో ఐక్య ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలిపిందంటే అతిశయోక్తి కాదు..
ఇప్పటికీ ఆయన.. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రస్తావనకు వస్తే.. అందులో హైటెక్ సిటీ ఖచ్చితంగా ఉంటుంది.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. జాతీయ స్థాయిలో కూడా కీలక భూమి పోషించారు చంద్రబాబు.. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో, ఇద్దరు ప్రధానుల ఎంపికలో ఆయన కీలకంగా వ్యవహరించారు.. 2004 మరియు 2009 ఎన్నికలలో వరుస పరాజయాల తర్వాత, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఆ సమయంలో, ప్రజా సమస్యలపై పోరాడటానికి మరియు పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నారు.. పాదయాత్ర చేపట్టారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత, 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు అవకాశం ఉన్నా.. విజయవాడకు వెళ్లి. రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించారు.. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలై.. అమరావతి నిర్మాణం ఆగిపోగా.. ఇటీవలి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. దీంతో, నాల్గోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి చంద్రబాబు.. మరోసారి అమరావతి నిర్మాణంపై దృష్టిసారించారు.. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి.. ప్రాజెక్టులు పూర్తి.. పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు..