AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌.. ఎన్నికల వ్యూహంపై చర్చ

Cm Chandrababu

Cm Chandrababu

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ సమన్వయ కమిటీలకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పాల్గొన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో కూటమి నేతలు తమ అభ్యర్థులతో కలిసి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు చంద్రబాబు..

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన దిశగా సమష్టిగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యత, సమన్వయం కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు.

మేయర్‌ అభ్యర్థులపై టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ
మరోవైపు, మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నం నగరాల మేయర్‌ అభ్యర్థుల పేర్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహులు పోటీలో ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రెండో జాబితా కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనుండటంతో అభ్యర్థుల ప్రకటనపై ఆసక్తి పెరిగింది. అయినప్పటికీ, ఆయా నగరాలకు మేయర్‌ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదన్న చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. మేయర్‌ అభ్యర్థుల ఎంపికలో జాప్యం ఎందుకు జరుగుతోంది? ఎవరికి అవకాశం దక్కనుంది? అన్న అంశాలు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండో జాబితా విడుదలతో ఈ ఉత్కంఠకు తెరపడుతుందా అన్నది వేచి చూడాలి.