Mission Godavari Clean Project: మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం

Centre Backs Mission Godava

Centre Backs Mission Godava

Mission Godavari Clean Project: గోదావరి నది కాలుష్య నివారణకు చేపట్టిన “మిషన్ గోదావరి క్లీన్” ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు. గోదావరి నదిని మున్సిపల్, పారిశ్రామిక కాలుష్యం నుంచి రక్షించి స్వచ్ఛమైన నదీ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) బృందాన్ని పంపేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అంగీకరించిందని వెల్లడించారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమైన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన ఎనిమిది కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు.

ఇటీవల అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న అరణ్యారామం కామన్ ఫెసిలిటీ సెంటర్‌కు అనుమతులు మంజూరు చేసినందుకు భూపేంద్ర యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు పవన్‌ కల్యాణ్‌.. నూతన అరణ్యం భవన్‌లో మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, హనుమాన్ మానిటరింగ్ సెంటర్, గ్రేట్ గ్రీన్ వాల్ పర్యవేక్షణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ వంటి ఆధునిక విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అలాగే నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం ఉన్న 90 బేస్ క్యాంపులను 150కు పెంచేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఇందుకు అవసరమైన 300 మంది అదనపు అటవీ గార్డుల నియామకం, బేస్ క్యాంపుల ఏర్పాటుకు కేంద్ర పథకాల నుంచి సహకారం అందించేందుకు కేంద్ర మంత్రి అంగీకరించినట్లు చెప్పారు.

×
×
Ad

గోదావరి నది కాలుష్య నివారణకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు అందించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల బృందాన్ని పంపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు పవన్ కల్యాణ్‌ వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి పరిశుభ్రతకు ఇది కీలక అడుగుగా అభివర్ణించారు. రాష్ట్రంలో అంతరించిపోయిన అడవి దున్నల (ఇండియన్ గోర్) పునరుద్ధరణకు మధ్యప్రదేశ్ నుంచి 50 అడవి దున్నలను తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో భూపేంద్ర యాదవ్ మాట్లాడగా, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో వాటిని పంపేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక ఇంక్లోజర్లు ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

అలాగే రాష్ట్రంలో ఆడ పులుల సంఖ్య తగ్గిపోవడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌… మహారాష్ట్ర నుంచి నాలుగు, మధ్యప్రదేశ్ నుంచి రెండు ఆడ పులులను తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల బెడదను తగ్గించేందుకు ఒడిశా నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రప్పించే అంశంపైనా చర్చించినట్లు చెప్పారు. గ్రీన్ ఇండియా మిషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 1,050 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని తుపానులు, ఉప్పెనలు, తీరప్రాంత కోతల నుంచి రక్షించేందుకు “గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని పవన్ తెలిపారు. ఇప్పటికే మూడు జోన్లలో 450 కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ ప్రాజెక్టుకు కేంద్రం మిస్టీ పథకం ద్వారా నిధులు అందించేందుకు అంగీకరించిందని చెప్పారు. భావితరాల కోసం పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..