Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి గంటగంటకూ సమీక్ష నిర్వహించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రాణనష్టం నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి స్వర్ణ గ్రామం స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఇదే బాధ్యతతో పనిచేయాలని సూచించామని తెలిపారు. చివరి బాధితుడికి కూడా న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
బాధితులకు పరిహారం కీలక ప్రకటన
తుఫాన్ కారణంగా నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇల్లు దెబ్బతిన్న వారికి రూ.10 వేల చొప్పున, దుకాణాలకు నష్టం వాటిల్లితే రూ.25 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. మోటారు వాహనాలు దెబ్బతిన్న వారికి రూ.3 వేలు, మూడు చక్రాల వాహనాలు దెబ్బతిన్న వారికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. బాధితులకు భరోసా కల్పించడంతో పాటు నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
- AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
- AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
- Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
గత తుఫాన్ల అనుభవంతో ముందస్తు చర్యలు
దివిసీమ నుంచి అర్నబ్ వరకు ఎన్నో తుఫాన్లను చూశానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.. గతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో విపత్తులను ఎదుర్కోవడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు. ప్రస్తుతం సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకుని తుఫాన్ కదలికలను నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎక్కడ ముంపు ప్రమాదం ఉంది, ఎక్కడ సహాయక బృందాలను మోహరించాలనే అంశాలపై ముందస్తు అంచనాలు వేసినట్లు వివరించారు. తుఫాన్ ప్రభావంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సీఎం తెలిపారు. విశాఖపట్నంలో ఒకరు, విశాఖ రూరల్ ప్రాంతంలో మాధవి, భీమవరంలో చుక్కల కిషోర్, అనకాపల్లిలో భాగ్యలక్ష్మి, సఖినేటిపల్లిలో గోడ కూలడంతో వెంకయమ్మ మరణించినట్లు వివరించారు. కొందరు తుపాను తీవ్రతను తక్కువగా అంచనా వేయడం కూడా ప్రమాదాలకు కారణమైందని విచారం వ్యక్తం చేశారు.
40 అంశాల సమాచారంతో తుఫాన్ అంచనా
తుఫాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు సుమారు 40 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రియల్ టైమ్‌లో విశ్లేషించామని చంద్రబాబు వెల్లడించారు. గాలుల వేగం, వర్షపాతం, రిజర్వాయర్ల సెన్సర్లు, క్యాచ్మెంట్ ప్రాంతాల సమాచారం, ఉపగ్రహాలు, రాడార్ ద్వారా అందిన వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. తుపాను అంచనాలు సుమారు 90 శాతం వరకు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. తీరాన్ని అర్ధరాత్రి 3 గంటల సమయంలో దాటుతుందని అంచనా వేసినా, ఉదయం 10 గంటల వరకు తుఫాన్ ప్రభావం కొనసాగిందని వివరించారు. తుఫాన్లు అనూహ్యంగా దిశ మార్చుకునే అవకాశం ఉన్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగం నమోదైందని తెలిపారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ కొన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాల వారీగా భారీ వర్షపాతం
తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఒక్కరోజే 218 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, మరో 66 మిల్లీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసినట్లు చెప్పారు. విజయనగరం జిల్లాలో 189 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, మరో 75 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 143 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, మరో 123 మిల్లీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి జిల్లాలో 142 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, మరో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదైనట్లు వివరించారు. అయితే, ఖరీఫ్ సీజన్లో ఒక దశలో రాష్ట్రంలో వర్షపాతం లోటు 53 శాతానికి చేరిందని చంద్రబాబు తెలిపారు. తుపానుకు ముందు ఈ లోటు 39 శాతంగా ఉండగా, తుపాను వర్షాల కారణంగా 27 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా వేసినట్లు చెప్పారు. అంటే సుమారు 12 శాతం వర్షపాతం లోటు భర్తీ అయ్యే పరిస్థితి ఉందని వివరించారు.
30 వేల మంది అధికారులతో సమీక్ష
తుఫాన్ సమయంలో అర్ధరాత్రి వేళ కూడా సుమారు 30 వేల మంది క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించామని సీఎం తెలిపారు. వివిధ శాఖల కార్యదర్శుల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించినట్లు వివరించారు. తుఫాన్ కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వైర్లు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తాయని తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఆ రెండు జిల్లాల్లోనూ ఎల్లుండి నాటికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ రెండు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
రహదారులపై చెట్ల తొలగింపు.. తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి
తుఫాన్ కారణంగా కూలిన చెట్లను తొలగించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని చంద్రబాబు తెలిపారు. ఆ రాత్రికల్లా అన్ని ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. తుఫాన్ సమయంలో ఒక్క చెరువు కూడా తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వల్ల సహాయక చర్యలను వేగంగా చేపట్టగలిగామని తెలిపారు. ఇక, తుఫాన్ నష్టం, రాష్ట్రానికి అవసరమైన సహాయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. బాధితులకు సాయం అందించడం, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడం, ప్రభావిత జిల్లాలను సాధారణ స్థితికి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
-
Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!