MLA Arava Sridhar controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను బాధితురాలు వీణా రోజుకొకటి విడుదల చేస్తోంది. అసెంబ్లీలో వీడియో కాల్‌లో మాట్లాడిన వీడియోను కూడా వీణా బయటపెట్టింది. ఈ మొత్తం వ్యవహారం పై ఇప్పటికే పార్టీ నియమించిన విచారణ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. బాధితురాలు విడుదల చేస్తున్న వీడియోలు, వాటి వివరాలను విచారణ కమిటీ సేకరిస్తోంది. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో విచారణ కమిటీ రైల్వే కోడూరులో పర్యటించనుంది. ఈ సందర్భంగా బాధితురాలు వీణా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పాటు మరికొందరిని కూడా కమిటీ కలవనుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనుంది.
Read Also: Zohran Mamdani: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరానాయర్ పేరు..
ఇక, విచారణ కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మొన్న జరిగిన జనసేన శాసనసభ సమావేశంలో ఈ వ్యవహారంపై పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక మరోవైపు, వీణా చేస్తున్న ఆరోపణలు, మాట్లాడుతున్న తీరు అనుమానాస్పదంగా ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.