Site icon NTV Telugu

Minister Anagani Satya Prasad: 22ఏ జాబితా నుండి భూముల తొలగింపు.. మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు..

Anagani Satya Prasad

Anagani Satya Prasad

Minister Anagani Satya Prasad: 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ బడ్జెట్ కేటాయింపులపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల 22ఏ జాబితాలో అనేక భూములు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి అధికారాల బదలాయింపు చేపట్టినట్లు చెప్పారు.

Read Also: Ram Mandir: అయోధ్య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ‘‘రామ మందిరం’’.. గణాంకాలు చూడండి..

ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే అధికారాన్ని ఆర్డీవోలకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి అనగాని… ఇకపై ఏదైనా భూమిని 22ఏ జాబితాలో చేర్చాలంటే సంబంధిత పట్టాదారునికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా ఈ-కేవైసీ విధానంలో నోటీసు ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనంతరం సమగ్ర విచారణ జరిపి, సరైన కారణాలతోనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇక, పదేళ్లకు పూర్వం అసైన్ చేసిన ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే ఇనాం భూముల సమస్యపై నియమిత జీవోఎం త్వరలో సమగ్ర పరిష్కారం సూచించనుందని చెప్పారు.

మరోవైపు, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు మంత్రి అనగాని… రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడానికి బ్లాక్‌చైన్ సాంకేతికతను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పాత రెవెన్యూ రికార్డులను ఆధునిక పద్ధతులతో స్కాన్ చేసి, శాశ్వత డిజిటల్ గుర్తింపుతో భద్రపరచనున్నట్లు చెప్పారు. ఇక, గత ప్రభుత్వ కాలంలో రీ-సర్వే మరియు ల్యాండ్ టైట్లింగ్ చట్టాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమ ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. భూముల విషయంలో ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..

Exit mobile version