AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?

Ap Local Body Elections

Ap Local Body Elections

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్‌ఈసీతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి స్థానిక ఎన్నికలకు సంబంధించి సంసిద్ధత ప్రకటించడం, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పూర్తికావడం, రిజర్వేషన్లపై నిర్ణయం రావడం, కోర్టు కేసులు తేలడం వంటి అంశాలు పూర్తయిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పారు.

అయితే ఎన్నికలు ఆలస్యమైనా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు అనిల్ చంద్ర పునేఠా. ఎల్లుండి జరిగే సమావేశంలో ప్రధానంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన సంసిద్ధతపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన వెంటనే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు. గత ఎస్‌ఈసీ నీలం సాహ్ని రూపొందించిన ఓటర్ల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికలకు సిద్ధమని ప్రకటిస్తే ఆ జాబితాను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఒకవేళ ఎస్‌ఐఆర్ పూర్తైన తర్వాత ప్రభుత్వం సంసిద్ధత తెలియజేస్తే ఏ ఓటర్ల జాబితాను అమలు చేయాలనే విషయంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు, 50 శాతం రిజర్వేషన్ అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపనున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం నుంచి స్పష్టత, కోర్టు తీర్పులు, రిజర్వేషన్ల అంశం, ఓటర్ల జాబితాపై నిర్ణయం వంటి అంశాలు పూర్తయిన తర్వాతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి.