AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 2026 మే 22న ECIR/HYZO/17/2026 నంబరుతో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ కేసులో నిందితులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల మేర నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అక్రమ మార్గాల్లో భారీగా ఆర్థిక లాభాలు పొందినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూన్ 11, 2026న ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టుల కేటాయింపు, ఆర్థిక లావాదేవీలు, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, అక్రమ ఆస్తుల కొనుగోలు వంటి అంశాలపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సోదాల సమయంలో నగదు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న వస్తువుల పూర్తి వివరాలను ఈడీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
ఈ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌కు సంబంధించి పలువురు కీలక వ్యక్తుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని సమాచారం. ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలు, మనీలాండరింగ్ కోణాలు వంటి అంశాలపై ఈడీ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసు పురోగతిపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మొత్తంగా ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో విచారణ ముమ్మరం చేశామని ఈడీ ప్రకటించింది.. ఈ స్కామ్‌లో రూ.195 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించామని.. అక్రమ మార్గాల్లో తమ అనుచరులకు లాభాలు చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టులు, షెల్ కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలు గుర్తించాం.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్‌కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేశాం.. ఇక, రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, విజయనర్సింహరెడ్డి, వల్లు సందీప్, కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్ ఇళ్లల సోదాలు నిర్వహించాం.. కారిమూరి ఇంట్లో 2 రోలక్స్ వాచ్‌లు రేంజ్ రోవర్ కారు సీజ్ .. కారుమూరి ఇంట్లో దొరికిన ఫోన్‌లో హవాలాకు సంబంధించిన చాటింగ్‌ను రికవరీ చేశామని పేర్కొంది ఈడీ..

