AP High Court: స్థానిక సంస్థల వేళ ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కలకలం సృష్టించాయి.. ఇక, పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలను పారా మిలటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను వైసీపీ హైకోర్టుకు సమర్పించింది. నామినేషన్ల సమయంలో పుంగనూరులో వాహనాల దహనం, రాయచోటిలో కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనలను వైసీపీ తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వాదించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పారా మిలటరీ బలగాలను మోహరించాలని కోర్టును కోరారు.
మరోవైపు, పుంగనూరులో ఉదయం 10 గంటల సమయంలో ఓ కాన్వాయ్ చేసిన హంగామా కారణంగానే ఘటనలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.. పుంగనూరు, రాయచోటిలో ఘటనలు జరిగిన వెంటనే సంబంధిత ఎస్పీలు స్పందించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ప్రస్తుతం రెండు ప్రాంతాల్లోనూ పరిస్థితులు అదుపులో ఉన్నాయని ప్రభుత్వ తరఫున న్యాయస్థానానికి వివరించారు. వైసీపీ, ప్రభుత్వం తరఫున ఇరుపక్షాల వాదనలను విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పారా మిలటరీ బలగాల పర్యవేక్షణకు సంబంధించి హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

