AP High Court: ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో పిటిషనర్ పాత్రపై కోర్టు తీవ్ర అభిప్రాయం వ్యక్తం చేస్తూ, సరెండర్ కావడం ఆయనకు మంచిదని సూచించింది. విచారణ సందర్భంగా “ఎప్పటిలోగా సరెండర్ అవుతారు?” అని కోర్టు నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. కేసు వివరాలను పరిశీలించిన అనంతరం, ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పిటిషనర్ పాత్ర కీలకంగా కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది.
అంతేకాకుండా, సంబంధిత ఎంపీని టార్చర్‌కు గురి చేసే అవకాశం ఉందనే విషయం సునీల్ కుమార్ నాయక్‌కు బాగా తెలుసని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరడం కంటే సరెండర్ కావడమే సముచితమని కోర్టు సూచించింది. “సరెండర్ అవుతారా? లేక ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగిస్తారా? ఒక నిర్ణయం తీసుకుని కోర్టు ముందు హాజరుకండి” అని ధర్మాసనం స్పష్టం చేసినట్లు సమాచారం.
దీనికి స్పందించిన సునీల్ కుమార్ నాయక్ తరపు న్యాయవాది, పిటిషనర్‌తో చర్చించి పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. తదుపరి చర్యలపై క్లయింట్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తదుపరి విచారణలో సునీల్ కుమార్ నాయక్ తరఫు నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి..

