AP High Court: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఇవాళ కూడా ఎన్నికల ప్రక్రియ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్.. తమ పార్టీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.. హైకోర్టులో పిటిషన్ వేశారు.. అయితే, ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది.. కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.. కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్ కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
కాగా, తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠరేపుతోన్న విషయం విదితమే.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎస్‌వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఈ ఎన్నిక ప్రక్రియ జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది.. భూమన అభినయ రెడ్డి రాజీనామాతో ఖాళీగా మారిన ఈ పదవికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష కూటమి ఈ స్థానంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, క్యాంప్ రాజకీయాలు ముదిరాయి. దీనితో గత మూడు రోజులుగా తిరుపతిలో క్యాంప్ రాజకీయాలు ఉధృతంగా సాగాయి. వైసీపీ కార్పొరేటర్లు పాండిచ్చేరి క్యాంప్‌లో ఉండగా, వారు కొద్దిసేపటి క్రితమే తిరుపతికి చేరుకున్నారు. మరోవైపు, చిత్తూరులో బసచేసిన వైసీపీ కార్పొరేటర్లను రాత్రి తిరుపతి టీడీపీ నేతలు కలిసే ప్రయత్నం చేయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విషయం తెలుసుకున్న భూమన అభినయ రెడ్డి హుటాహుటిన చిత్తూరుకు చేరుకుని తన పార్టీ కార్పొరేటర్లను తిరుపతిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. వైసీపీ గత ఎన్నికల్లో 48 కార్పొరేటర్లను గెలుచుకున్నప్పటికీ, ఇప్పటికే 20 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి..