NTV Telugu Site icon

Andhra Pradesh: మరో శాఖలో అవకతవకలపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక..

Babu

Babu

Andhra Pradesh: గృహ నిర్మాణం పేరిట కేంద్ర నిధులు దుర్వినియోగమయ్యాయా.. అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. గృహ నిర్మాణ శాఖలో అవకతవకలు జరిగాయని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేపడతామని అప్పట్లోనే హెచ్చరించారు. అధికారంలోకి రావడంతో.. హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Read Also: Double ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మధ్య విభేదాలు నిజమేనా.. ప్రమోషన్స్ కు పూరి దూరం..?

నిధుల దుర్వినియోగం, పక్కదారి పట్టిన నిధుల విషయమై లెక్కలు తీస్తోన్న గృహ నిర్మాణ శాఖ అధికారులు.. వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిధుల దారి మళ్లింపు జరిగిందని గుర్తించారు. కేంద్రం నిధుల్లోనూ అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. గృహ నిర్మాణ శాఖలో సుమారు 3 వేల 183 కోట్ల రూపాయల వరకు.. కేంద్రం నిధుల దుర్వినియోగం అయినట్టు లెక్కగట్టారు. ఇళ్లు నిర్మించకున్నా.. లెక్కల్లో చూపించి మభ్యపెట్టారంటూ నివేదిక ఇచ్చారు.

Read Also: Marriage Dates: శుభ ముహూర్తాలు మొదలు.. 17, 18 తేదీల్లో వేలాది వివాహాలు!

పీఎంఏవై నిధులను పక్క దారి పట్టించిన గత ప్రభుత్వం… కేంద్ర స్కీంకు 1575 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల.. ఇళ్ల నిర్మాణ పథకాన్ని గందరగోళంలోకి నెట్టేసిందని అధకారులు పేర్కొంటున్నారు. నిర్మించిన ఇళ్ల లెక్కలకి గత ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇచ్చినట్టు గుర్తించారు. లక్షా 32వేల 757 ఇళ్లను నిర్మించకున్నా.. లెక్కల్లో చూపించి మభ్యపెట్టిందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చారు అధికారులు. దీంతో సీరియస్ యాక్షన్‌కు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.