Site icon NTV Telugu

AP Government: ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు.. ఇది కూటమి ప్రభుత్వ విజయం..

Narayana

Narayana

AP Government: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని మంత్రుల కమిటీ సమావేశం పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి నారా లోకేష్ చాంబర్ లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు టీజీ భరత్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి హాజరై.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోగా, అందులో ఇప్పటికే వివిధ రంగాల్లో సుమారు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఇందులో అత్యధికంగా ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్నాయన్నారు మంత్రులు.. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 73 వేల ఉద్యోగాలు, టూరిజం రంగంలో 49,765 ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: YS Jagan Car Seized: జగన్‌ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్‌ చేసిన పోలీసులు

ఇక, ఎంఎస్ఎంఈ రంగంలో గత పదేళ్లలో సగటున 50వేల ఉద్యోగాలు మాత్రమే లభించగా, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 5 రెట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటురంగంలో కల్పిస్తున్న ఉద్యోగాలను గ్రామ సచివాలయాల ద్వారా ట్రాక్ చేసి పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని మంత్రులు సూచించారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, సమిష్టి కృషితో ఈ లక్ష్యాన్ని అధిగమించి తీరుతామని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, అక్కడ అసంఘటిత రంగంలో ఇప్పటికే 10 వేల మంది పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అత్యధిక ఉద్యోగాలు లభించే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ సెక్టార్లపై అధికారులు దృష్టిసారించాలని అన్నారు మంత్రి నారాయణ..

Exit mobile version