Andhra Pradesh: రాష్ట్రంలో ఏకంగా 50 లక్షల మందికి చెందిన సమాచారం లేదని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సచివాలయంలో జరుగుతోన్న రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో.. తొలి రోజు దీనిపై ప్రకటన చేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కేవలం 4.9 కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని.. మిగతా 50 లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని సదస్సులో వెల్లడించింది.. పురపాలక, రెవెన్యూ, రవాణా, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన వివిధ శాఖల్లో వీరి సమాచారమే లేదని స్పష్టం చేసింది.. గతంలో చేపట్టిన సర్వేల్లో వీరెవరూ వివరాలు ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని వెల్లడించారు గ్రామవార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి..
కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి పెట్టి జనవరి 31వ తేదీలోగా వివరాలు సేకరించాలని సూచించారు గ్రామవార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి.. అయితే, ఇంటింటి సర్వే ద్వారా పౌరులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలోని పౌరుల బ్యాంకు వివరాలు కూడా అనుసంధానించాలని తెలిపారు.. రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానించటంతో పాటు ఫొటోలు కూడా తీయాలని స్పష్టం చేశారు.. గ్రామాలు, హ్యాబిటేషన్ల వారీగా కుటుంబాల మ్యాపింగ్ కూడా చేయాల్సిందిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సూచిచింది ఏపీ ప్రభుత్వం..