NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ కోరికే తప్ప.. వ్యూహాలు లేవు..!

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో కూటమి గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి సహా.. కూటమి ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశాన్ని ప్రారంభించారు చంద్రబాబు. ఈ సమావేశంలో పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని నేను ప్రకటన వెనుక రాష్ట్రం బాగుండాలనే కోరికే తప్ప.. వ్యూహాలు లేవు అని వ్యాఖ్యానించారు.. అయితే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండడానికి ఎంతో కష్టపడ్డాం అన్నారు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే బలమైన ఆకాంక్షే.. అద్భుత విజయాన్ని తెచ్చి పెట్టింది. అందరి సమిష్టి కృషితో అద్భుత విజయం సాధ్యమైందన్నారు.. గెలుస్తున్నాం.. కొడుతున్నాం.. అని మొదటి నుంచి చెప్పింది చంద్రబాబే అన్నారు.. భయం లేకుండా ఉండడం చంద్రబాబు దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. చంద్రబాబుకు ఏం జరిగినా భయమనేదే ఏ కోశానా లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కుటుంబ సభ్యులను కించపరిచినా.. చంద్రబాబు గుండె చెక్కు చెదరలేదన్నారు.. ఇదో వే ఆఫ్ లైఫ్ అని చంద్రబాబు అన్నారు అని తెలిపారు.

Read Also: Balineni to Meet Pawan Kalyan: జనసేన గూటికి బాలినేని..! రేపు పవన్‌ కల్యాణ్‌తో భేటీ

ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం వేదికగా మరోసారి సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు పవన్‌ కల్యాణ్‌.. కష్టకాలంలో ఎలా వ్యవహరించాలో చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నా. 53 రోజులు జైల్లో పెట్టిన రోజుల్లో నేను షూటింగులు కూడా చేయలేను. చంద్రబాబు జైల్లో ఉంటే నేను షూటింగుల్లో పాల్గొంటే బాగుండదని నేను షూటింగ్ చేయలేదు. రాష్ట్రం విభజన నాటి నుంచి ఇప్పటి వరకు నలిగిపోతూనే ఉన్నాం. తెలంగాణ అభివృద్ధిలో మనం కేవలం మూడో వంతు మాత్రమే ఉన్నాం. తెలంగాణతో పోటీ పడాలి.. ఎదగాలి అని ఆకాక్షించారు.. అందర్నీ సమన్వయపరిచి.. సుతిమెత్తగా మాట్లాడుతూ.. ఆకర్షించే నాయకుడు చంద్రబాబు. చంద్రబాబుతో కలిసి పని చేయడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. 100 రోజుల్లో ఏం చెప్పారో.. అది చేసి చూపించారు. మెగా డీఎస్సీ భర్తీ చేపడుతున్నాం. పెన్షన్ అమలు చేయడం కష్టమైనా చేసి తీరాలని చంద్రబాబు అన్నారని తెలిపారు పవన్‌..

Read Also: Balineni to Meet Pawan Kalyan: జనసేన గూటికి బాలినేని..! రేపు పవన్‌ కల్యాణ్‌తో భేటీ

చంద్రబాబు దార్శనికుడు.. ఇంకుడు గుంతలంటే ఏదో చిన్న అంశంగా కన్పిస్తుంది.. కానీ, దాని వల్ల వచ్చే లాభాలు అపారం. ఇప్పుడు ఇంకుడు గుంతలు జీవన విధానంలో భాగమైంది అన్నారు పవన్‌ కల్యాణ్‌.. సీఎం చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నా. పెన్షన్ రూ. 4 వేలు ఇవ్వడం ఓ ఎత్తు అయితే.. తొలి నెలలో రూ. 7 వేలు ఇవ్వడం మరో అద్భుతం. సంక్షేమంలో ఇదో తిరుగులేని చరిత్ర. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా వచ్చేవి కావు. ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు వస్తున్నాయి. స్థానిక సంస్థలకు గత ప్రభుత్వం నిధులను పక్క దారి పట్టిస్తే.. చంద్రబాబు రూ. 1450 కోట్లు ఇచ్చారు. నీరసపడుతోన్న స్థానిక సంస్థలకు జవజీవాలు కల్పించారు. అన్న క్యాంటీన్లతో చంద్రబాబు పేదల ఆకలి తీర్చారు. అన్న క్యాంటీన్లను ఎలా తీసేయాలని గత ప్రభుత్వానికి ఎలా అనిపించిందో అర్థం కావడం లేదన్నారు.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసిన చంద్రబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజముద్రను తీసేసి.. ఓ వ్యక్తి ఫొటో పెట్టుకున్నారంటే గత పాలకులను ఏం అనాలి..? అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, చంద్రబాబు ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తోంది.. విపరీతమైన ఓపిక చంద్రబాబుకు ఉందని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Show comments