Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!

Annapareddy Vijaya Bhaskar

Annapareddy Vijaya Bhaskar

Annapareddy Vijaya Bhaskar Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి.. వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీలో తాను చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీలో ఎవరికీ సరైన సభ్యత్వాలు లేవని, సంతకాలు లేని లెటర్ ప్యాడ్లపై పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పార్టీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే శ్రేణులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కొందరికే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు.

ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ మోహన్ రెడ్డి వమ్ము చేసుకున్నారని విజయభాస్కర్ రెడ్డి విమర్శించారు.. జగన్ వల్ల రాజకీయంగా, ఇతరత్రా లబ్ధి పొందిన వారు కూడా ఇప్పుడు వైసీపీలో లేరని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ఉన్నంతకాలం జగన్ మళ్లీ అధికారంలోకి రావడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ గెలుపొందడం వెనుక వైసీపీ నేతల పాత్ర కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోనూ వైసీపీకి చెందిన కొందరు నాయకులు కూటమిలో ఉన్న తమ మిత్రుల గెలుపు కోసం పనిచేశారని ఆరోపించారు.

జగన్ మోహన్ రెడ్డిని కలవాలంటే ముందుగా ఆయన కోటరీని కలవాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు విజయభాస్కర్‌ రెడ్డి. పార్టీ అధినేతకు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మధ్య కోటరీ అడ్డుగోడగా మారిందని అన్నారు. భజన బృందం, కోటరీ మొత్తం కలిసి జగన్ మోహన్ రెడ్డికి, పార్టీ కార్యకర్తలకు మధ్య దూరం పెంచాయని ఆరోపించారు. మరోవైపు జనసేన, టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పరస్పరం కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ, టీడీపీ రాజకీయాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన సజ్జలను ఉద్దేశించి కూడా తీవ్ర విమర్శలు చేశారు. సకల శాఖల మంత్రిగా పేరుపొందిన సజ్జల రామకృష్ణారెడ్డి.. జగన్‌కు ఎదురవుతున్న సకల శోకాలకు కారణమయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీలో నాయకత్వ లోపం, కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడం, కోటరీ రాజకీయాల కారణంగానే పార్టీ పరిస్థితి దిగజారిందని అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.