Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల ఏర్పాట్ల కోసం మొత్తం రూ.150 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు, కొవ్వూరు మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, నర్సాపురం మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయించింది. అలాగే నిడదవోలు, పాలకొల్లు, మండపేట మున్సిపాలిటీలకు కూడా అవసరమైన నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను ప్రధానంగా పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఇప్పటికే ఉన్న సదుపాయాల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాల ఏర్పాటు వంటి పనులకు వినియోగించనున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

