Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవర్తనపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ఆయనది ఓపెనింగ్‌లో ఓవర్ యాక్షన్, ఇంటర్వెల్లో డల్, చివరిలో కన్ఫ్యూజన్ అంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్‌లో ఎవరినో బెదిరించాలనే భావన కనిపిస్తోందని అంబటి ఆరోపించారు. పవన్‌ను ఎవరైనా విమర్శించారా? లేక వైసీపీపై ఎందుకు దూషణలు చేస్తున్నారని ప్రశ్నించారు.
Read Also: 2.5K డిస్ప్లే, HarmonyOS 5.1, 10,100mAh బ్యాటరీతో Huawei MatePad 11.5 (2026) టాబ్లెట్ లాంచ్..!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా మార్చి వారి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు అంబటి. ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయడానికి వైసీపీ కోటి సంతకాలు సేకరించిందని తెలిపారు. మెడికల్ కాలేజీల స్కాంలో బాగస్వామ్యం ఉంటే జైలుకు పంపుతామని వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని అంబటి గుర్తు చేశారు. ఈ స్కాంల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో పదిహేను ఏళ్లు కలిసి ఉంటామని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని అంబటి తప్పుబట్టారు. ప్రపంచంలో ఇంతకాలం ఒప్పందాలు రాసుకునే రాజకీయ పార్టీలు ఉండవని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఆగలేదని, అందులో మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వాటాలు వస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ ప్రాణత్యాగానికి సిద్ధమని చెప్పడాన్ని ఎద్దేవా చేస్తూ, ఆయన్ను అల్లూరి సీతారామ రాజుతో లేదా నక్సలైట్‌తో పోల్చడం సరైంది కాదన్నారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో భాగస్వాములు కాదని పవన్ స్పష్టం చేయగలరా? అని ప్రశ్నించారు. అమరావతి భూముల స్కాం సహా పలు స్కాంలపై వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని అంబటి హెచ్చరించారు. లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్కు పవన్ మద్దతు ఇస్తున్నారని, ఆ రెడ్ బుక్కు చివరికి వాళ్లే బలయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు… ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం మొదలైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.