Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Cm Chandrababu

Cm Chandrababu

Amaravati Projects: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. అభివృద్ధి పనులను వేగంగా చేపడుతూ ముందుకు సాగుతోంది.. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి నేడు పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం ప్రారంభించనుండగా, సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా ప్రజలకు అంకితం చేయనున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రహదారి, రవాణా సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ఈ ప్రాజెక్టులు కీలకంగా నిలుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుంది.

స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, అనంతరం సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా, గుంటూరు ఛానల్‌పై నిర్మించిన మరో స్టీల్ బ్రిడ్జిని కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం రాయపూడి చేరుకుని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ)కి అప్పగించిన ప్రజా ప్రతినిధుల భవనాలను పరిశీలించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును కూడా జీఏడీకి అప్పగించే కార్యక్రమం ఉండనుంది. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తుండటంతో అమరావతి అభివృద్ధిలో ఇది మరో కీలక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంటోంది.

సీఎం చంద్రబాబు షెడ్యూల్
* ఉదయం 10:20 గంటలకు: ఉండవల్లిలోని నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు.
* ఉదయం 10:35 గంటలకు: ఉండవల్లి సమీపంలోని స్టీల్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు.
* అనంతరం: స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
* ఉదయం 10:45 నుంచి 11:50 గంటల వరకు: సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులతో సీఎం సమావేశమవుతారు.
* రైతుల సమావేశంలో: సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.
* ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు: గుంటూరు ఛానల్‌పై నిర్మించిన మరో స్టీల్ బ్రిడ్జిని పరిశీలిస్తారు.
* అనంతరం: రాయపూడికి చేరుకుని జీఏడీకి అప్పగించిన ప్రజా ప్రతినిధుల భవనాలను సీఎం పరిశీలిస్తారు.