Union Minister Pemmasani Chandrasekhar: ప్లాట్ల విషయంలో ప్రతి నెలా వాస్తు మార్పులు చేయడం కష్టం అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన త్రి-మెన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక అంశాలను వెల్లడించారు. ఇవాళ రైతులకు సంబంధించిన పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని ఆయన తెలిపారు. వీధి పోటు ఉన్న ప్లాట్ల విషయంలో కొంతవరకు మార్పులు చేసుకునే అవకాశం ఉందని రైతులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. అయితే, ఒకసారి ప్లాట్లు అమ్మిన తర్వాత మార్పులు చేయడం కష్టమని పేర్కొన్నారు. అలాగే జరీబు భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక నెల సమయం కావాలని కోరామని, సాయిల్ టెస్ట్ పూర్తైన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: Harish Rao: ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రి పాలైన 90 మంది విద్యార్థులు.. పరామర్శించిన హరీష్‌రావు..
ఇక, గ్రామ కంఠాలకు సంబంధించిన అంశాల్లో ముందుగా వెరిఫికేషన్ చేసి ఆపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లంక భూములకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించామని, ఇంకా కొంతమంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్‌లో ఇప్పటికీ సుమారు 2,400 ఎకరాల భూములు కొంతమంది రైతులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒకవేళ భూ సమీకరణ కుదరకపోతే, వచ్చే నెల మొదటి వారంలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రతి నెలా వాస్తు మార్పులు చేయడం సాధ్యం కాదు” అని స్పష్టంగా పేర్కొన్న మంత్రి, ఇబ్బందులు ఉన్న రైతులు ఒకేసారి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
మరోవైపు, తాడికొండ బైపాస్ రోడ్డుతో కొంతమంది రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అంగీకరించారు పెమ్మసాని.. స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగిన రైతులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపారు. హెల్త్ కార్డుల అంశంపై గ్రామ సభలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని, అలాగే గ్రామాల్లో డీపీఆర్ ప్రకారం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఎల్‌పీఎస్ ప్రాంతాల్లో సరిహద్దు రాళ్ల ఏర్పాటు త్వరలో ప్రారంభమవుతుందని, అలాగే 18 కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ త్వరలో పూర్తిచేస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.