Akvan Cyclone: బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుఫాన్‌గా మారి.. తీరం వైపు దూసుకొస్తుంది.. తుఫాన్ బలపడిన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన మందగమనంతో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ఎల్లుండి మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాబోయే 48 గంటల పాటు రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF బృందాలు, 11 SDRF బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
తుఫాన్ ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రపై కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందని హోంమంత్రి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇక, అధికారిక హెచ్చరికలను మాత్రమే నమ్మాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను విశ్వసించవద్దని అనిత స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని తెలిపారు.
మరోవైపు.. విద్యుత్ అంతరాయం, చెట్లు కూలడం, నీరు నిలిచిపోవడం తదితర సమస్యలు ఎదురైతే వెంటనే మన మిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009కు సమాచారం ఇవ్వాలని హోంమంత్రి సూచించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు ఏ అవసరం ఉన్నా స్థానిక అధికారులను సంప్రదించాలని తెలిపారు. కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..

