Site icon NTV Telugu

Andhra Pradesh: నేటి నుంచి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు

Alluri Sitaramaraju Min

Alluri Sitaramaraju Min

దేశంలో బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఉంటారు. 1897 జూలై 4న విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అయితే చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యి ఆయన చదువు మానేసి సన్యాసిగా మారి పశ్చిమగోదావరి జిల్లా అడవుల్లో నివసించేవారు. అడవుల్లో జీవనం సాగించే సమయంలోనే బ్రిటీష్ వారి అటవీ చట్టాల ద్వారా గిరిజనులపై జరుగుతున్న దాడులను అల్లూరి తన కళ్లారా చూశారు. దీంతో గిరిజనుల కష్టాలను తొలగించాలని ఏకంగా బ్రిటీష్‌ వారిపైనే సమరానికి సిద్ధమయ్యారు. అందుకే అల్లూరికి మన్యం వీరుడు అని పేరొచ్చింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన వీర రంపా తిరుగుబాటుకు ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటీష్ వలస పాలనలో ఆదివాసీ ప్రజలు వారి స్వంత భూముల నుండి పరాధీనులుగా మారుతున్న ప‌రిస్థితులు.. భారత అటవీ సంపదను దోచుకోవడానికి, బ్రిటీష్ వారు వివిధ ప్రజా వ్యతిరేక చట్టాల ద్వారా స్థానిక యజమానుల స్వంత భూమిని లాక్కోవడానికి తీసుకొచ్చిన చట్టాలను అల్లూరి సీతారామరాజు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి మద్దతుగా అల్లూరి సీతారామరాజు ప్రతిజ్ఞ చేసినప్పటికీ ఆయన బ్రిటీష్ పాలకులపై పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. అల్లూరి నేతృత్వంలోని గిరిజన సైనికులు గెరిల్లా వ్యూహాల ద్వారా అడవుల్లోని వివిధ ప్రదేశాల్లో బ్రిటిష్ అధికారులపై హింసాత్మక దాడులు చేశారు. చివరకు 27 ఏళ్ల వయసులోనే అల్లూరిని చింతపల్లె అడవుల్లో చెట్టుకు కట్టేసి బ్రిటీష్ పాలకులు కాల్చి చంపారు.

కాగా స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం నేటి నుంచి వారంరోజుల పాటు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తోంది. భీమవరంలో తొలిరోజు విద్యార్థులు దేశనాయకుల వేషధారణల్లో భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. జూలై 4న ప్రధాని మోదీ స్థానిక ఏఎస్ఆర్ నగర్‌లో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Exit mobile version