Marigold Farmers: దసరా వేళ సిటీల్లో పూల ధరలు మండిపోతున్నాయి.. సద్దుల బతుకమ్మ, దసరా నేపథ్యంలో.. పెద్ద నగరాల్లో రూ.60, రూ.70, రూ.90, రూ.100 ఇలా కిలో బంతుపూలు విక్రయిస్తున్నారు.. అయితే, అల్లూరి జిల్లా పాడేరులో బంతిపూల రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. దసరా పండుగ సందర్భంగా బంతిపూలకు మంచి ధర లభిస్తుందని ఆశించిన ఆదివాసీ రైతులకు నిరాశే మిగిలింది. పండుగకు పూలకు డిమాండ్ పెరుగుతుందని భావించి ఎంతో కష్టపడి పండించిన బంతిపూలను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ రోజుల్లో రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలికే బంతిపూల బుట్టకు పాడేరు మార్కెట్లో ప్రస్తుతం కేవలం రూ.20 నుంచి రూ.50 మాత్రమే లభిస్తోందని రైతులు వాపోతున్నారు. కొందరు దళారులు బుట్టను రూ.20 నుంచి రూ.30కే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో పూల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు, పండించిన పూలను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకురావడానికి రానుపోను రవాణా ఖర్చులే సుమారు రూ.100 అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. బంతిపూల అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం రవాణా ఖర్చులకే సరిపోకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పండుగ సమయంలోనైనా మంచి ఆదాయం వస్తుందన్న ఆశతో మార్కెట్కు వచ్చిన తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బంతిపూల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదివాసీ రైతులు కోరుతున్నారు. మార్కెట్లో ధరల పతనంతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, మార్కెట్ మాయజాలం మాత్రం మారడం లేదు.. పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేకపోగా.. వినియోగదారులకు కూడా పూల ధర అందుబాటులో ఉండడం లేదు.. ఏమైనా.. మధ్య దళారులు లబ్ది పొందుతున్నారు..

