బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో హడావిడి…. భక్తుల సందడి మామూలుగా వుండదు. అందునా తిరుమల బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతారు. తూర్పుగోదావరి జిల్లాలో వాడపల్లి భక్తులకు ఎంతో ఇష్టమయిన ప్రాంతం. తిరుమలకు వెళ్ళలేని భక్తజనం ఇక్కడ స్వామివారిని దర్శించి తరిస్తారు.తిరుపతి, ద్వారకా తిరుమల తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి.
గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ప్రశాంతత చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కోనసీమ తిరుమల వాడపల్లి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది. ఈ నెల 14 నుంచి 22 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేశారు.
Read Also: Sankastha Hara Chaturdhi Bhakthi Tv Live: సంకష్ట హర చతుర్థి నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
స్వామివారి ఆలయాన్ని విద్యుద్దీపాలు, ఫల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు దేవాదాయ శాఖ అధికారులు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వరకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇవి చూడముచ్చటగా వున్నాయి. సుమారు రూ.70 లక్షల వ్యయంతో తొమ్మిది రోజుల పాటు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. వివిధ వాహనాల్లో మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు స్వామివారు.
సాధారణంగా ఏటా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడు శనివారాల నోము నోచుకున్న భక్తులతో కిటకిటలాడుతుంటుంది. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతూ వుంటుంది. అక్టోబర్ మాసంలో బ్రహ్మోత్సవాల కు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోనూ ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
ఇక్కడి దేవాలయములోని మూర్తి ధారు మూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడి గ్రామస్తులు బ్రహ్మోత్సవాలు, తిరునాళ్ళకు రోజూ అన్నసంతర్పణ చేస్తుంటారు. వాడపల్లిలో మార్చినెలలో జరిగే తిరునాళ్ళ ఉత్సవాలకు వెళ్ళే భక్తులను భోజనానికి మావద్దకు రండి అంటే మావద్దకురండి అని పిలుస్తూ వుంటారు.
Read Also: Bus Fire: బస్సులో చెలరేగిన మంటలు.. అగ్నికి ఆహుతైన 17 మంది ప్రయాణికులు