A Lawyer Filed Case To Bring Back His Wife Asthikalu: అప్పుడప్పుడు పోలీసులకు వింత ఫిర్యాదులు అందుతుంటాయి. అసలు ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయా? అంటూ పోలీసులే కాదు, యావత్ ప్రజానీకం కూడా నివ్వెరపోయేలా కొందరు అనూహ్యమైన కంప్లైంట్స్‌తో పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారు. ఇప్పుడు అలాంటి వింత ఘటనే తాజాగా వెలుగు చూసింది. తన భార్య అస్థికలు పోయాయంటూ.. ఒక న్యాయవాది పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు హాట్ టాపిక్‌గా మారింది. ఎలాగైనా తన భార్య అస్థికలు తెచ్చివ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న కోడూరి వెంకటేశ్వరరావు భార్య వెంకటలక్ష్మి ఈనెల 14వ తేదీన మృతి చెందారు. దీంతో 15వ తేదీన పాలకొల్లు కైలాసవనంలో అంత్యక్రియలు నిర్వహించారు. 16వ తేదీన ఒక చిన్న కార్యక్రమం జరిపాక.. అస్థికలను భద్రపరచమని కాటి కాపరికి ఇచ్చారు. ఈరోజు ఉదయం అస్థికలను గోదావరిలో కలపాలనుకున్న వెంకటేశ్వరరావు.. అస్థికలు తీసుకునేందుకు కైలాసవనానికి వెళ్లారు. కాటికాపరికి అస్థికలు ఇవ్వమని అడిగారు. అయితే.. కాటికాపరి అస్థికలు కనిపించడం లేదని, ఎక్కడో పోయాయని షాకిచ్చాడు. అలా ఎలా పోతాయంటూ కాటికాపరితో వాగ్వాదానికి దిగారు. ఎక్కడా వెతికినా దొరక్కపోవడంతో.. ఆయన పోలీసుల్ని ఆశ్రయించారు. తన భార్య అస్థికలు పోయాయని, దయచేసి వాటిని తెచ్చివ్వమని వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.