AP Pension Distribution: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండగ జోరుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి అయిందని అధికారులు తెలిపారు. తొలి రోజునే 96 శాతం పెన్షన్లను పంపిణీ చేసి ఎన్డీయే కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది.. సాయంత్రం 4 గంటల సమయానికి 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నాలుగు శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేలా సచివాలయ ఉద్యోగుల ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ చేశారు.
Read Also: Devineni Uma: ప్రజా సమస్యను తీర్చేందుకు టీడీపీ-జనసేన- బీజేపీలు కృషి చేస్తున్నాయి..
ఇక, శ్రీ సత్యసాయి జిల్లాలోని గుండుమల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్దిదారుడి ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. కాళ్లు మొక్కడానికి వచ్చిన వారిని చంద్రబాబు ఆపారు. లబ్దిదారుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ కు ముఖ్యమంత్రి సూచించారు.