NTV Telugu Site icon

Andhra Pradesh: దివిసీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు

Diviseema Uppena

Diviseema Uppena

Andhra Pradesh: చరిత్రలో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గుళికలు కూడా ఉంటాయి. అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమ ఉప్పెన విషాదం. యావత్ భారత్ దేశాన్ని కదిలించిన దివి సీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుపానుతో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి అధికారికంగానే 14వేలకు పైగా ప్రజలు మరణించారు. అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గుట్టలుగా శవాలు పేరుకుపోయాయి. లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. అప్పట్లోనే సుమారు రూ.172 కోట్ల నష్టం సంభవించింది.

అసలు ఏం జరిగింది?
1977 నవంబర్ 18న అండమాన్‌ నికోబార్‌ దీవులు వద్ద తీరానికి 520 కిమీల వద్ద అల్పపీడనం ఏర్పడి తరువాత తుఫానుగా రూపాంతరం చెందింది. గంటకు 170 కిమీల వేగంతో దిశలు మార్చుకుంటూ తుఫాను ప్రయాణం చేసింది. ఇది మన సముద్ర తీరానికి 140 కిమీల దూరంలో ఉండగా వాతావరణ శాఖ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కాని అప్పటికే ఆలస్యమైంది. అప్పటికి ఇంకా సమాచారం, సాంకేతిక రంగం అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకోలేదు. దీనితో అపార నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. మేఘాలు నల్లగా మారడంతో భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. అయితే మర్నాడు అంటే నవంబర్ 19న నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటిన తుఫాను బీభత్సం సృష్టించింది. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా మూడు తాటిచెట్ల ఎత్తులో సముద్ర కెరటాలు ప్రళయం సృష్టించాయి. అనేక గ్రామాలపై దివిసీమ ఉప్పెన పెను విధ్వంసం సృష్టించింది. గాలి బీభత్సంతో పాటు రాకాసి అలలకు వేలాది మంది ప్రజలు బలయ్యారు.

దివిసీమ ఉప్పెనతో నష్టపోయిన ప్రజలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి ప్రభుత్వపరంగా ఆదుకున్నారు. అనేక స్వచ్చంద సంస్థలు కూడా తమ వంతుగా బాధితులకు సాయం అందించాయి. ఎవరు ఎంత సాయం చేసినా కోలుకోలేని విలయం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. దివిసీమ ఉప్పెన తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్రప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను అధికారులు తీరం పొడవునా ఏర్పాటు చేశారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు.

Show comments