దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్లో మొత్తం 60 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒంటరిగానే పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈ మేరకు ఇవాళ పార్టీ 60 అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. తన సిట్టింగ్ స్థానం హేంగాంగ్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు.
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ బీజేపీ అభ్యర్ధుల్ని ప్రకటించారు. మరోసారి మణిపూర్ లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రశాంతంగా ఉండాలంటే అది బీజేపీ వల్లే సాధ్యం అంటున్నారు కేంద్రమంత్రి. మణిపూర్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తామని భూపేందర్ యాదవ్ అన్నారు. దీర్ఘకాలంపాటు బీజేపీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇచ్చామని చెప్పారు. క్రీడలు, అధికారులు, విద్యావేత్తలకూ టికెట్లు ఇచ్చామని వెల్లడించారు. ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లుచేశారు.