విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతు మహాజన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామన్నారు. భీమసింగిలో ఉత్పత్తి చేసిన చక్కెరను వివిధ హిందూ దేవాలయాల్లో ప్రసాదానికి వాడేందుకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ విధంగా చేయడం వల్ల సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని లక్ష్మీనారాయణ అన్నారు.
భారతదేశంలో 749 చక్కెర కర్మాగారాలు ఉన్నాయని.. అందులో ఆంధ్ర రాష్ట్రంలో 39 చక్కెర కర్మాగారాలు ఉన్నాయన్నారు. చాలామటుకు మూసివేశారని , కేవలం 6 మాత్రమే పనిచేస్తున్నాయని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. సభ అనంతరం చక్కెర కర్మాగారం గౌరవ ఛైర్మన్ అయిన విజయనగరం జాయింట్ కలెక్టర్ ను కలిసి సభలోని ప్రస్తావించిన అంశాలను తెలియజేస్తామని ఆయన అన్నారు.
స్థానిక మంత్రులు కూడా కర్మాగారాన్ని తెరిపించే సదుద్దేశంతో ఉన్నారని తెలిసిందని వారు కూడా ప్రయత్నించి రైతులకు చక్కెర లాంటి తీపి కబురు అందించాలని లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా రాష్ట్ర నాయకులు బీశెట్టి బాబ్జి సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు..జామి మండలానికి సంబంధించిన నేతలు, రైతులు పాల్గొన్నారు..