ఏపీలో ఎన్నికలు జరగని పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియలో 8వ వార్డు ఉపసంహరణ విషయంలో మొదటినుండి హై డ్రామా నడిచింది. 8వ వార్డు టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించు కున్నాడని వైసీపీ అభ్యర్థి ఒక్కరే బరిలో ఉండటంతో ఏకగ్రీవంగా ప్రకటించారు.
8వవార్డులో తండ్రి కొడుకులు ఇద్దరూ టీడీపీ తరుపున పోటీ చేశారు. ఉపసంహరణలో తండ్రి తన నామినేషన్ ని ఉపసంహరించు కున్నారు. అయితే తన కుమారుని ఉపసంహరణ పత్రాలు కూడా తానే సమర్పించాడని ఎన్నికల అధికారి తెలపడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 8వ వార్డు అభ్యర్థి శ్రీనును మధ్యాహ్నం వెంట బెట్టుకొని ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జి నూకసాని బాలాజీ అక్కడికి వచ్చారు. ఎన్నికల అధికారికి 8వ వార్డు అభ్యర్థి తరపున టీడీపీ బి ఫామ్ ఇచ్చి ఎకనాలెడ్జ్ మెంట్ కాగితాన్ని తీసుకున్నారు.
సాయంత్రం ఏడుగంటల సమయంలో టీడీపీ అభ్యర్థి ఉపసంహరణ పత్రాలు మధ్యాహ్నం సమర్పించారని ఎన్నికల అధికారి తెలపడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్,మార్కాపురం,దర్శి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి,నారపుశెట్టి పాపారావు,దర్శి నియోజకవర్గ ఇంచార్జి పమిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.