ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు…హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటరు చావుకొచ్చింది. ఈ ఎన్నికల ప్రచారం వారికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దాదాపు ఐదు నెలల నుంచి నియోజకవర్గం ప్రజలు వింత సమస్యని ఎదుర్కొంటున్నారు. రోజుకు కనీసం పది నుంచి పన్నెండు మంది గుంపు ఇంటికి వచ్చి దండం పెట్టి మరీ టార్చర్ చేస్తున్నారు. ఒక గ్రూపు అటు తిరగారో లేదో..ఇటు ఇంకో గ్రూపు రెడీ. కండువాలే తేడా..సీన్ మాత్రం ఒకటే. నేతలు ఇంటికి వచ్చి ఓటేయమని అడగటం మొదట్లో బాగానే అనిపించింది. అబ్బ…వాళ్లకు తామంటే ఎంత విలువో అని సంబరపడ్డారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.
ఓటు అడగటానికి వస్తే వచ్చారు..ఓటు తమకే వేయమని అభ్యర్థిస్తే సరిపోతుంది కదా! కానీ వచ్చినవారు అంతటితో ఆగుతారా? గెలిస్తే ఏం చేస్తామో వివరించటంతో పాటు తమ హామీల చిట్టా విప్పి చాట భారతం చెపుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు విసిగిపోయారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఈ తలనొప్పి మరీ ఎక్కువైందని వాపోతున్నారు. ఈ టార్చర్ భరించలేక కొందరు ఇంటి ముందు తలుపులకు తాళాలు వేశారు. ఇంటి వెనక నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
ఇటీవల, టిఆర్ఎస్ కార్యకర్తలు ఓ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి యజమాని స్నానం చేస్తున్నాడు. వచ్చిన వారు అదేమీ పట్టించుకోకుండా ఒక్కసారిగా చుట్టు ముట్టి కరపత్రాలు చేతిలో పెట్టారు. కుటుంబ సమేతంగా తమ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. ఇదీ వారి పద్దతి. ఇక వ్యవసాయ పనులుకు వెళ్లిన వారిని కూడా వదలట్లేదు. ఏకంగా పొలాలకే వెళుతున్నారు. నేతలు మందీ మార్బలంతో వెళ్లి వారిని కమ్మేస్తున్నారు. వ్యవసాయ పనులలో ఉన్నారని కూడా చూడకుండా తమ సోది వినిపిస్తున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ఇలా ఎందుకు చేస్తున్నారని నేతలను ప్రశ్నిస్తే తమకు ఇంతకు మించిన మార్గం లేదని అంటున్నారు. ప్రచారం ముగిసే వరకు అందరిని కవర్ చేయాలన్న అతృత నాయకులలో కనిపిస్తోంది. అలాగే ఇంటింటికి వెళ్లటం ద్వారా తమ మేనిఫెస్టో గురించి వివరించి ఓటు అడిగే అవకాశం ఉంటుంది. అందుకే ఓటరు ఇంటి తలుపు తడుతున్నామని అంటున్నారు.
ఇక కొందరు కార్యకర్తలు ప్రతి రోజు ఫోన్లు చేసి చంపుతున్నారు. కుప్పలు తెప్పలుగా వాట్సాప్ మెసేజ్‌లు చేసి ఓపికను పరీక్షిస్తున్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఓటర్లు వాట్సాప్ వాడటమే మానేశారు. 30వ తేదీ వరకు దాని జోలికే పోయేదిలేదంటున్నారు. చాలా మంది ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. దీనిని బట్టి ఓటర్లకు నేతలు ఏ స్థాయిలో నరకం చూపిస్తున్నారో అర్థమవుతోంది.
మరోవైపు, ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ సారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ రానున్నాయి. సాధారణంగా ఇవి ఉద్యోగులకే పరిమితం. ఐతే. కరోనా కారణంగా వృద్ధులు, వికలాంగులకు కూడా అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్‌కు చివరిరోజైన గురువారానికి మొత్తం 822 మంది అర్హులకు గాను 758 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ రక్షణ, ఇతర విభాగాల్లో పనిచేసే సుమారు 149 మంది సర్వీస్ ఉద్యోగులు ఈ నెల 30 వరకు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నికల భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.