టీడీపీకి ప్రతిపక్షంలో ఉండటం.. అధికారంలోకి రావడం కొత్తేమీ కాదు. గత కొన్ని దశాబ్ధాలుగా ఆపార్టీ ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన టీడీపీ ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. అయితే గత ఓటమి నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేదని ఆపార్టీ నేతల వైఖరి చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీనికితోడు టీడీపీ సీనియర్లంతా వరుసబెట్టి గుడ్ బై చెబుతున్నారు. దీంతో ఆ పార్టీ భవిష్యత్ ఏంటనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.
నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. ఐదేళ్లపాటు ఏపీని పరిపాలించారు. తానే ఏపీకీ ఎప్పటికీ సీఎంగా ఉంటానన్న రేంజులో కలరింగ్ ఇచ్చారు. దీంతో ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన రాజధానికి కూడా గాలికొదిలేశారన్న విమర్శ ఉంది.. చేయాల్సిన అభివృద్ధి పనులన్నీ నత్తనడకగా సాగించారు. దీంతో ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. వైఎస్ జగన్ ఇమేజ్ కు తోడు టీడీపీ వ్యతిరేకత తోడవడంతో గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన ఏజెండాగా పని చేస్తూ ముందుకెళుతున్నారు. ఆయన పాలనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కన్పించడం లేదు. దీనికితోడు టీడీపీ నేతలు కరోనా సాకుతో ఇంటికే పరిమితమై పోతున్నారు. ప్రజా సమస్యలపై పెద్దగా పోరాడిన దాఖలాల్లేవు. మరోవైపు ప్రభుత్వంపై గట్టిగా గళం విప్పిన నేతలను వైసీపీ టార్గెట్ చేస్తోంది. దీంతో మెజార్టీ నేతలు సైలంటైపోతున్నారు. మరోవైపు బాబు తన వయస్సు పైబడటంతో తన కుమారుడిని లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన లోకేష్ నాయకత్వంలో పని చేసేందుకు టీడీపీ సీనియర్లు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
ఈ కారణంగానే చాలామంది సీనియర్లు ఆపార్టీకి వరుసగా గుడ్ బై చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందే కేఈ కృష్ణమూర్తి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన చంద్రబాబు నాయుడికి సమకాలీకుడు. బాబు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుండగా ఆయన మాత్రం అస్త్రసన్యాసం చేశారు. దీంతో గత ఎన్నికల్లో ఆయన కుమారుడు శ్యాంబాబుకు పత్తికొండ అసెంబ్లీ సీటును ఇచ్చారు. అయితే జగన్ వేవ్ ముందు ఆయన ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇప్పుడు ఆపార్టీలో ఎంతమంది చంద్రబాబుతో ఉన్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
టీడీపీలో యాక్టివ్ పాలిటిక్స్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి, గల్లా అరుణ కుమారిలు సైతం ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే వీరి కుమారులు మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని, తన టిక్కెట్ ఎవరికైనా ఇచ్చుకోండి అంటూ ఆయన నేరుగా చంద్రబాబుకే చెప్పినట్లు తెలుస్తోంది. తనపై ఆరోపణలు చేసిన బుద్దా వెంకన్న, బొండా ఉమలపై బాబు చర్యలు తీసుకోకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా టీడీపీ నేతలు పలు కారణాలను సాకుగా చూపుతూ ఇటీవల కాలంలో ఆపార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంతో ఈ పార్టీకి భవిష్యత్ లేదనే నేతలు ముందుగానే సైడ్ పోతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారనేది ఆసక్తిని రేపుతోంది.