భూమి మీద ఉండే అతి పెద్ద క్షీరదాలు ఏనుగులు. వాటితో మనుషులకు చాలా మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మన చిన్నతనం నుంచే ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు అంటూ ఆడుకుంటూ ఉంటాం. కేవలం మనుషుల విషయంలోనే కాదు దేవుళ్లకు కూడా ఏనుగులతో మంచి బంధం ఉంది. దేవేంద్రుడి వాహనం కూడా ఐరావతం. మన పురాణాలలో సైతం ఏనుగుల జాతి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రధమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు సైతం గజముఖధారియే. అంతటి ప్రాసస్త్యాం కలిగిన గజరాజుల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఏనుగుల జాతి అంతరించే ప్రమాదం ఉందని ప్రపంచ వ్యాప్తంగా పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆ విషయాలను తెలుసుకుందాం.
ప్రపంచ ఏనుగుల దినోత్సవం చరిత్ర
ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏటా ఆగష్టు 12వ తేదీ నిర్వహిస్తారు.2011లో కనజ్వెస్ట్ పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు చెందిన కెనడియన్ సినీ నిర్మాతలు ప్యాట్రిసియా సిమ్స్, మైఖేల్ క్లార్క్, ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ సంస్థ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్దరనంద సంయుక్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. 2012లో సిమ్స్‌తో కలిసి ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ అధికారికంగా మొదటిసారి ‘వరల్డ్ ఎలిఫెంట్ డే’ ను నిర్వహించింది. ఆ సదస్సులో ఆసియా, ఆఫ్రికా జాతి ఏనుగులు ఎదుర్కొంటున్న కష్టాలపై చర్చించడం జరిగింది. మన పర్యావరణంలో ఏనుగుల పాత్ర ఎంతగొప్పదో ఈ సందర్భంగా చర్చిస్తారు. అంతేకాకుండా గజరాజులను ఎలా సంరక్షించుకోవాలి, తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు, ఆ రంగంలో పరిజ్ఞానం ఉన్నవారు వివరిస్తారు.
ఏనుగులకు మనిషే శత్రువులా ఎలా మారుతున్నాడు?
వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం ఏనుగులను బంధించే సంస్కృతి మన దేశంలో ఉంది. ఆచారం పేరుతో జరిగే ఈ చర్యలన్నీ కూడా వాటి స్వేచ్ఛను హరించేవే. ఏనుగు దంతాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండటంతో వాటిని వేటాడి, హింసించి దాని దంతాలను బలవంతంగా పీకి వాటితో దొంగ వ్యాపారాలు చేస్తున్నాడు మనిషి. వాటికి సొంతమైన అడవి భూమిని పంటల పేరుతో ఆక్రమించి, వాటి మనుగడకు అవసరమైన నీటి కుంటలను పూడ్చేస్తూ వాటితో చెలగాటమాడుతున్నాడు. పొలాల్లోకి రాకుండా వాటి చుట్టూ కంచె వేసి కరెంట్ షాక్ పెడుతున్నారు. వీటి కారణంగా బలైన మూగ ప్రాణాలు ఎన్నో. అంతేకాకండా జనావాసాల్లోకి తప్పిన పోయిన వచ్చిన వాటిపై కరుణ చూపకుండా కొట్టి చంపిన ఉదంతాలు అనేకం. ఏదీ ఏమైనా మనిషి ఇలాగే ప్రవర్తిస్తే అంతరించి పోయిన జీవజాతుల్లో ఏనుగులు కలవడం ఖాయం. అందుకే వాటి రక్షణకు ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న చర్యలకు అదనంగా మరిన్ని చర్యలు చేపట్టడం అవసరం.