Ganesh Chaturthi: సకల దేవతలకు గణపతి దేవుడు గణ నాయకడు. అందుకే ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా గణపతిని పూజిస్తుంటారు. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టి రచనకు ముందుగా గణపతిని పూజించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటి వినాయకుడి పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు. సాధారణంగా వినాయకచవితిని చాంద్రమానంలోని ఆరో నెలలో జరుపుకుంటాం. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు వేర్వేరు కోణాల్లో ఉంటారు. కాబట్టి భూమిపై పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ రోజున చంద్రుడిని చూడకూడదని భావిస్తుంటారు.
మరోవైపు పురాణాల ప్రకారం చంద్రుడిని చూస్తే నీలాపనిందలు ఎదురవుతాయని విశ్వసిస్తుంటారు. కైలాసంలో ఓ రోజు పార్వతి దేవి శివుని కోసం ఎదురుచూస్తూ స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారచేసి దానికి ప్రాణం పోసి వాకిట్లో కాపలాగా ఉంచి వెళుతుంది. అంతలో అక్కడికి శివుడు రాగా ఆ బాలుడు ఆయనను అడ్డుకుంటాడు. ఇంతలో కోపానికి లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. ఆ శబ్దానికి పార్వతి బయటకు వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి అతనికి గజాననడు అనే పేరును పెడతాడు. ఆ బాలుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించిన శివుడు అతడిని గణాధిపతిగా పిలుస్తారు. దాంతో దేవతలు గణేశునికి విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ విందును కడుపారా భోంచేసిన గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూసి శివుని శిరస్సున గల చంద్రుడు నవ్వుతాడు. దాంతో గణపతికి దిష్టి తగిలి పొట్ట పగిలిపోతుంది.
Read Also: Ganesh Chaturthi: వినాయకుడిని తాకిన ‘పుష్ప’ క్రేజ్.. వైరల్‌గా మారిన ‘పుష్ప’ వినాయకుడు
తన కుమారుడిని తిరిగి బ్రతికించుకున్న ఆ తల్లి పార్వతి దేవి భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు నీలాపనిందలను ఎదుర్కుంటారని శపిస్తుంది. అయితే దేవతలంతా కలిసి పార్వతికి నచ్చచెప్పడంతో ఆ రోజున వినాయకవ్రత కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఈ శాపం వర్తించదని చెపుతుంది. కానీ పాలు పితుకుతూ భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూసినందుకు శ్రీ కృష్ణుడంతటి వారు కూడా నీలాపనిందలను మోయవలసి వచ్చింది. ఈ ప్రభావాన్ని గుర్తించిన దేవతలు, మానవులు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి అక్షింతలు నెత్తిపై వేసుకుని గణపతి దేవుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు.
వినాయక చవితి రోజు ఈ తప్పులు చేయకండి:
• రెండు గణపతి విగ్రహాలను ఇంట్లో ఉంచరాదు
• నలుపు, నీలం రంగు దుస్తులు ధరించి గణపతిని పూజించరాదు
• గణపతి పూజ చేసి ఉపవాసం ఉన్న వారు శారీరక సంబంధాలలో పాల్గొనరాదు
• వినాయకచవితి నాడు ఎలుకలను చంపకూడదని ప్రతీతి
• గణపతి పూజ అయ్యే వరకు చంద్రుడిని చూడరాదు