NTV Telugu Site icon

Viral News: మా ఇంటికి రాకండి.. దొంగలకు ఓ కుటుంబం వినతి

Theft

Theft

Viral News: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలందరూ పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లిపోతున్నారు. దీంతో పట్టణాల్లో రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. అయితే ప్రజలు సొంతూళ్లకు వెళ్లడం దొంగలకు వరంగా మారింది. చాలాచోట్ల గుట్టుచప్పుడు కాకుండా చోరీ ఘటనలు జరుగుతున్నాయి. ఇదే మంచి టైం అనుకుని దొంగలు కూడా చోరీలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఓ ఇంటి యజమాని మాత్రం స్వగ్రామానికి వెళ్తూ తన ఇంటి తలుపునకు అతికించిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సదరు యజమాని ‘మేము సంక్రాంతికి ఊరు పోతున్నాం.. డబ్బు, నగలు కూడా తీసుకుని పోతున్నాం.. మా ఇంటికి రాకండి.. ఇట్లు మీ శ్రేయోభిలాషి’ అంటూ పేపర్ మీద రాసి దానిని తలుపుపై అతికించి తాళం వేసుకుని వెళ్లాడు.

Read Also: Ambati Rambabu: డ్యాన్స్ ఇరగదీసిన ఏపీ ఇరిగేషన్ మంత్రి.. వీడియో వైరల్

అయితే ఈ పోస్టర్ చూసిన నెటిజన్‌లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఒకవేళ సదరు ఇంటికి దొంగలు వెళ్లినా శ్రమ వృథా అవుతుందేమోనని కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టర్ ఎవరు ఎక్కడ అతికించారన్న వివరాలు మాత్రం లభించలేదు. కాగా హైదరాబాద్‌ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు వెళ్తుండడంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా రైళ్లు, బస్సులు తిప్పుతున్నారు. రోజువారీ నడిచే 278 సాధారణ రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లు తిరుగుతున్నా రద్దీ తగ్గడం లేదు. సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి శుక్రవారం ఒక్క రోజే 5 లక్షల మందికి పైగా ప్రయాణించినట్లు సమాచారం అందుతోంది.