NTV Telugu Site icon

Viral News : దేశంలోనే తొలిసారి.. తెలంగాణలో మెటావర్స్ టెక్నాలజీ

Meataverse

Meataverse

మెటావర్స్‌..! టెక్‌ ప్రపంచంలో ఇదే లేటెస్ట్‌ ట్రెండ్‌. సరికొత్త సాంకేతిక మాయాలోకం. కంప్యూటర్‌పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. ఫిజికల్‌ గా మన ప్రసెన్స్‌ లేకపోయినా… అవతార్‌ల రూపంలో లైవ్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందొచ్చు. చర్చలు.. సమావేశాలే కాదు.. రోజువారీ భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ మెటావర్స్‌ వేదికగా చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్‌ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినియోగించుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన తెలంగాణ స్పేస్‌టెక్‌ పాలసీ ఆవిష్కరణకు మెటావర్స్‌ వేదికగా నిలిచింది.

ఐటీ రంగానికి కేరాఫ్‌ అడ్రస్ గా మారింది హైదరాబాద్. దిగ్గజ కంపెనీలకే కాదు.. అధునాతన టెక్నాలజీలకు కూడా హైదరాబాద్‌ అడ్డాగా మారుతోంది. టెక్‌ ప్రపంచంలో హాట్‌ టాపిక్ గా మాట్లాడుకుంటున్న మెటావర్స్‌పై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది. తెలంగాణ స్పేస్‌టెక్‌ ప్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించేందుకు దేశంలోనే తొలిసారి మెటావర్స్‌ను వేదికగా చేసుకుంది. మెటావర్స్‌ టెక్నాలజీ తో తెలంగాణ స్పేస్‌ టెక్‌ పాలసీని ఆవిష్కరించారు ఐటీ మంత్రి కేటీఆర్‌.

రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఎమర్జింగ్‌ టెక్నాలజీల్లో స్పేస్‌టెక్‌ కీలకం. ఇప్పటికే పలు ప్రైవేటు సంస్థలు.. స్టార్టప్‌ కంపెనీలు ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. టీ-హబ్‌లోని స్టార్టప్‌లు సైతం స్పేస్‌ టెక్నాలజీ ఆవిష్కరణలతో రాకెట్‌ ప్రయోగాల్లో టెక్‌ సపోర్ట్‌ అందిస్తున్నాయి. స్పేస్‌ టెక్నాలజీపై వర్క్‌ చేస్తున్న కంపెనీలు, స్టార్టప్‌లకు ప్రభుత్వ మరింత ప్రాధాన్యమిచ్చేందుకు రాష్ట్ర ఐటీ శాఖ తెలంగాణ స్పేస్‌టెక్‌ పాలసీని రూపొందించింది.

ప్రభుత్వం అధికారికంగా ఒక పాలసీని విడుదల చేయాలంటే ప్రత్యేకంగా ఉన్నత స్థాయిలో సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రభుత్వ అధికారులు, మీడియా సహా ఎంతో మంది పాల్గొనే ఇలాంటి సమావేశాలను నిర్వహించాలంటే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనికి భౌతికంగా ఎన్నో వ్యయప్రయాసలు ఉంటాయి. ఇలాంటి వాటికి పుల్‌స్టాప్‌ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి అత్యాధునిక మెటావర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంది.

మెటావర్స్ టెక్నాలజీ అంటే… వీడియో గేమ్‌ ఆడుతున్నప్పుడు హెడ్‌ఫోన్‌లు, వర్చువల్ రియాలిటీ గాడ్జెట్‌ల సహాయంతో డిజిటల్ ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవుతామో అలాంటిదే. ఉదాహరణకు మీ ఫ్రెండ్స్‌ అంతా ఏదైనా హాలిడే ట్రిప్‌ కు వెళ్తే… మీరు వెళ్లలేకపోయి ఉంటే… మెటావర్స్‌ టెక్నాలజీతో… మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తోపాటే టూర్‌ లో ఉన్న అనుభూతి పొందొచ్చు. మీరు ఒక సమావేశానికో… ఫంక్షన్‌ కో.. వెళ్లలేకపోయి ఉంటే… మెటావర్స్‌ టెక్నాలజీ సాయంతో.. మీ ఫిజికల్‌ ప్రసెన్స్‌ లేకపోయినా.. మీరు వెళ్లిన అనుభూతి పొందొచ్చు. మెటావర్స్ అనేది పూర్తిగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై ఆధారపడిన వర్చువల్ ప్రపంచం. వాస్తవ ప్రపంచంలో మీరు ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా… ఉన్న చోట ఉండే… అక్కడికి వెళ్లిన ఫీల్‌ పొందొచ్చు. చేయాలనుకన్నదంతా… డిజిటల్‌గా చేయొచ్చు. మీరు ఇంట్లో ఉండే.. అంతరిక్షంలోకి వెళ్లిన అనుభూతి పొందొచ్చు. మెటావర్స్‌లో ప్రతిదీ వర్చువల్. అందులో వాస్తవికంగా ఏమీ జరగదు. మీరు వాస్తవికంగా లేనప్పటికీ.. మీరు ఉనికిలో ఉన్న ప్రపంచాన్ని సూచిస్తుంది.

వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ అండ్ హై-స్పీడ్ ఇంటర్నెట్ లేకుండా మెటావర్స్‌ ని అనుభవించలేరు. దీనికి ఆగ్మెంటెడ్ రియాలిటీ గాగుల్స్, స్మార్ట్‌ఫోన్ అండ్ మొబైల్ యాప్ అవసరం. మొబైల్ ఫోన్‌ ద్వారా కనెక్ట్‌ అవలేం. మెటావర్స్‌ రికార్డ్ చేయబడిన వీడియోలను మొబైల్‌లో చూడొచ్చు కానీ… ఫీల్‌ అనుభవించలేరు.

Read Also: Ravidra Vishwanath : టీఆర్‌ఎస్‌ పార్టీ తప్పులను ఎత్తి చూపడమే సాయి గణేష్‌ తప్పా

మెటావర్స్‌లో ఒకరి అవతార్‌ను రూపొందించడానికి 360 డిగ్రీల స్కానింగ్ ఉంటుంది. మెటావర్స్‌ పూర్తిగా హై-స్పీడ్ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. మెటావర్స్ ఒక వర్చువల్ ప్రపంచమే అయినప్పటికీ… హార్డ్‌వేర్ పరంగానూ విస్తృతంగా ఉపయోగించారు. ఒకరకంగా చెప్పాలంటే… మెటావర్స్‌ అనేది ఇంటర్నెట్ భవిష్యత్తు.