కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అందుకోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం పెట్రోల్, నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలోని ఓ షాప్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించాడు. సెల్‌ఫోన్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలను ఉచితంగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే… యూపీలోని వారణాసికి చెందిన మొబి వరల్డ్ షాప్ అనే స్టోర్ యజమాని తమ స్టోర్‌లో రూ.10వేలకు పైగా విలువైన మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే లీటరు పెట్రోల్ ఉచితంగా అందిస్తామని ప్రకటించాడు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ కొనుగోలు చేస్తే ఐదు నిమ్మకాయలు కూడా ఉచితంగా ఇస్తామని బోర్డులు ఏర్పాటు చేశాడు. దీంతో సదరు స్టోర్ ప్రకటించిన ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అయితే దేశంలో పెట్రోల్, నిమ్మకాయల రేట్లు మండిపోతుండటంతో వాటిని ఉచితంగా అందిస్తామంటూ ఆఫర్ ప్రకటించడం తమకు కలిసి వచ్చిందని స్టోర్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.
