NTV Telugu Site icon

Baby letter to PM Modi: మోడీజీ.. మీ వల్లే మా అమ్మ నన్ను కొట్టింది. ఒకటో తరగతి చిన్నారి లేఖ వైరల్‌

Viral News

Viral News

Viral News: నిత్యావసరాల ధరల పెరుగుదల వల్ల పరోక్షంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఒకటో తరగతి విద్యార్థిని ఏకంగా ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లా ఛిబ్రమౌ పట్టణానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కృతి దూబే ఈ లెటర్‌ని హిందీలో రాసింది. ‘ప్రధానమంత్రి’కి అంటూ ప్రారంభించింది. ‘నా పేరు కృతి దూబే. ఒకటో తరగతి చదువుతున్నాను. మోడీజీ.. మీ వల్లే దేశంలో సరుకుల రేట్లు నింగినంటుతున్నాయి. చివరికి నా పెన్సిల్‌, రబ్బర్‌ (ఎరేజర్‌) కూడా ఖరీదయ్యాయి. నేను ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ సైతం ప్రియమైంది.

అందువల్ల నాకు పదే పదే పెన్సిళ్లు కొనివ్వటం మా అమ్మకు కష్టమైపోతోంది. పెన్సిల్‌ కావాలని అడిగితే చాలు కోప్పడుతోంది. కొడుతోంది. నేనేం చేయాలో అర్థంకావట్లేదు. నా పెన్సిల్నేమో తోటి విద్యార్థులు కొట్టేశారు’ అని లేఖను ముగించి పోస్ట్‌ చేసింది. కృతి దూబే రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారటంపై ఆమె తండ్రి విశాల్‌ దూబే స్పందించారు. అది తన కూతురి ‘మన్‌ కీ బాత్‌’ అంటూ చమత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలా ఆఖరి ఆదివారం ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ‘మనసులో మాట’ (మన్‌ కీ బాత్‌) చెబుతుంటారు కదా. దాన్ని విశాల్‌ పరోక్షంగా ప్రస్తావించారు.

UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర

ఆయన న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కూతురు ఇటీవల పెన్సిల్‌ పోగొట్టుకోవటంతో తల్లి ఆగ్రహంతో కొట్టిన మాట వాస్తవమేనని చెప్పారు. దీంతో బిడ్డ తీవ్రంగా నొచ్చుకుందని, అందుకే తన బాధను ఈ ఉత్తరం రూపంలో వెల్లడించిందని తెలిపారు. ఈ విషయమై ఛిబ్రమౌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం) అశోక్‌ కుమార్‌ కూడా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చిన్నారి లెటర్‌ రాసిన సంగతి తనకు కూడా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారానే తెలిసిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను వ్యక్తిగతంగా ఆ విద్యార్థినికి సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఆ అమ్మాయి రాసిన లెటర్‌ సంబంధిత అధికారులకు చేరేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని కూడా ఆయన అన్నారు. అయితే ఈ లెటర్‌పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాగీపై వసూలు చేస్తున్న జీఎస్‌టీ నామమాత్రమే (5 శాతమే) అని, సగటు జీఎస్‌టీ 18 శాతమని ఓ వ్యక్తి చెప్పాడు. పెన్సిల్‌పై వేస్తున్న జీఎస్టీ 12 శాతమని, ఇది గతంలోనూ ఉన్న సేల్స్‌ ట్యాక్సే తప్ప కొత్తగా తెర మీదికి వచ్చింది కాదని స్పష్టం చేశాడు. ఇక, తల్లి బిడ్డను కొట్టిందనేది కట్టుకథేనని, అది పెయిడ్‌ ఏజెంట్ల కల్పనా చాతుర్యమని ఎద్దేవా చేశాడు.