NTV Telugu Site icon

Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..

Karnataka

Karnataka

చాలా మంది ప్రైవేట్ ఉద్యోగానికి బదులు ప్రభుత్వ ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లపై ఓ తహసీల్దార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మిగిలేది లేదని, పానీపూరీ అమ్మే వాడు మనకంటే గొప్పవాడని తహసీల్దార్‌ చెప్పారు. పానీ పూరీ అమ్మేవాడి సంపాదన కూడా తమ కంటే ఎక్కువేనని ఆ తహసీల్దార్ వ్యాఖ్యానించాడు.

READ MORE: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!

తాలూకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోలెనర్సీపూర్ తహసీల్దార్ కేకే కృష్ణమూర్తి మాట్లాడుతూ..”ఈ ఉద్యోగం చేయడం కంటే.. పానీపూరీ లేదా గోబీ మంచూరియన్‌ను అమ్మడం మేలు. ఎందుకంటే వాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్లొచ్చు. మా జీవితాలు వారికి విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కనీసం మా కుటుంబంతో కలిసి దేవాలయాలకు కూడా వెళ్లలేకపోతున్నాం.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE:Amit Shah: లొంగిపోయిన మావోలపై వరాల జల్లు.. ఇల్లుతో పాటు ఉపాధి కల్పిస్తామని ప్రకటన

“టెక్నాలజీ మా పనిభారాన్ని పెంచాయి. సీనియర్ అధికారులు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వారి పనిని పర్యవేక్షిస్తున్నారు. పని అప్పగించిన రోజూ పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యం అయితే.. శాఖాపరమైన విచారణ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. విలేజ్ అకౌంటెంట్లు కూడా భయంతో బిక్కు బిక్కు మంటూ ఏం జరిగినా.. బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఉపాధ్యాయులు విద్యపై దృష్టి పెట్టకుండా పిల్లలకు గుడ్లు, అల్పాహారం పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలతో భారాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆహారంలో ఏం లోపం జరిగినా..వారి ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది.” అని హోలెనర్సీపూర్ తహసీల్దార్ కేకే కృష్ణమూర్తి నిర్భయంగా వెల్లడించారు. అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఒత్తిడి కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నట్లు పలువురు అధికారులు తెలిపారు.

Show comments