NTV Telugu Site icon

Mahalinga Nayak: నీళ్ల కోసం ఏకంగా ఏడు సొరంగాలు త‌వ్వాడు… ప‌ద్మ‌శ్రీ సాధించాడు..

అత‌నికి చిన్న‌త‌నం నుంచి రైతు కావాల‌ని క‌ల‌. రైతుగా మార‌డానికి చిన్న‌త‌నం నుంచి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాడు మ‌హాలింగ నాయ‌క్‌. ఎంత క‌ష్ట‌ప‌డినా ఉండేందుకు చిన్న గుడిసెను కూడా ఏర్పాటు చేసుకోలేక‌పోయాడు. రైతుగా మారాలంటే పొలం కావాలి. పోలం లేకుండా వ్య‌వ‌సాయం చేయ‌డం చాలా క‌ష్టం. అయితే, తాను ప‌నిచేసే య‌జ‌మాని వ‌ద్ద చాలా కాలం మ‌హాలింగ నాయ‌క్ న‌మ్మ‌కంగా ప‌నిచేశాడు. నాయ‌క్ ప‌ని న‌చ్చ‌డంతో అత‌నికి య‌జ‌మాని మంగుళూరుకు 55 కిలోమీట‌ర్ల దూరంలోని అద్యనాద‌క్ గ్రామంలో రెండు ఎక‌రాల పొలం ఇచ్చాడు. అయితే, ఈ పోలం కొండ‌ల్లో ఉన్న‌ది. అక్క‌డ నీళ్లు ప‌డ‌వు. నిళ్లు తెచ్చుకోవాలి అంటే కొండ నుంచి కింద‌కు దిగి రావాలి. దేనికి ప‌నికిరాని భూమిని ఇచ్చాడ‌ని మ‌హాలింగ నాయ‌క్ స్నేహితులు పేర్కొన్నారు. కానీ, మ‌హాలింగ నాయ‌క్ బాధ‌ప‌డ‌లేదు. భ‌య‌ప‌డ‌లేదు.

Read: Golden Visa: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఎవ‌రికి ఇస్తారు?

పూర్వం రోజుల్లో కొండ‌ను తొలిచి నీళ్లను మ‌ళ్లించేవారు. అదే విధంగా మ‌హాలింగ నాయ‌క్ కొండ‌ను తొల‌వ‌డం మొద‌లుపెట్టారు. మొద‌టి ఏడాది కొండ‌ను 36 మీట‌ర్ల సొరంగం త‌వ్వాడు. కానీ నీళ్లు ప‌డ‌లేదు. ఆ త‌రువాత మ‌రోవైపు 65 మీట‌ర్ల సొరంగం త‌వ్వాడు. అక్క‌డా నీళ్లు ప‌డలేదు. అయిన‌ప్ప‌టికీ మ‌హాలింగ నాయ‌క్ ఆశ‌లు వ‌దులుకోలేదు. మూడో ఏడాది కొండ‌ను మ‌రోవైపు నుంచి త‌వ్వ‌డం మొద‌లుపెట్టారు. అలా త‌వ్విన త‌రువాత వారికి రాళ్ల‌లో నీటి చెమ్మ క‌నిపించింది. వెంట‌నే మ‌రోవైపు నుంచి సోరంగం త‌వ్వాడు. అలా ఎనిమిదేళ్లు క‌ష్ట‌ప‌డి ఏడు సొరంగాలు తవ్వాడు. పైపుల‌తో నీటిని మ‌ళ్లించి మ‌హాలింగ నాయ‌క్ నివ‌శించే ప్రాంతంలో పెద్ద గోతిని ఏర్పాటు చేసి అందులోకి నీటిని నిల్వ చేసుకున్నాడు. ఎండాకాలంలో సైతం నీరు వ‌స్తుంది. ఒంటిచేత్తో ఏడు సొరంగాలు తవ్విన మ‌హ‌లింగ నాయ‌క్ కృషిని కేంద్రం గుర్తించి అత‌నికి పద్మ‌శ్రీ అవార్డును బ‌హుక‌రించింది.