దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లోని HDFC వినియోగదారుల ఖాతాల్లో ఇంకా జమవుతూనే వున్నాయి కోట్లాది రూపాయలు. తాజాగా మెదక్ కి చెందిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ లో లక్ష కాదు.. కోటి కాదు ఏకంగా రూ.9.61 కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఖాతాలో రూ.9.61 కోట్లు జమ అయినట్లు మెసేజ్ రావడంతో… నిజమా? కాదా? అనే అనుమానంతో రూ.4.97 లక్షలను మరో ఖాతాకు బదిలీ చేశాడు నరేందర్.
ఇంకేముంది.. తనకున్న క్రెడిట్ కార్డ్ బిల్ రూ.1.42 లక్షల రూపాయలు కట్టేశాడు నరేందర్. ఇంకా అకౌంట్ లో రూ. 9 కోట్లకు పైనే బ్యాలెన్స్ ఉండడంతో.. అసలు తన ఖాతాలోకి అంతమొత్తంలో డబ్బులు ఎందుకొచ్చాయో అర్థంకాక బ్యాంక్ కి వెళ్ళాడు నరేందర్. బ్యాంకు అధికారులు సాంకేతిక సమస్య అని చెప్పి నరేందర్ ఖాతాను ఫ్రీజ్ చేసి, వాడుకున్న మొత్తాన్ని మైనస్ బ్యాలెన్స్ గా చూపించారు బ్యాంక్ అధికారులు. ఇప్పుడు వాడుకున్న డబ్బులు ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాడు నరేందర్..
ఇది ఒక్క నరేందర్ కథే కాదు.. దేశవ్యాప్తంగా అనేకమంది HDFC బ్యాంకు కస్టమర్లకు ఎదురైన అనుభవం. తమ బ్యాంకు అకౌంట్లలో ఇంత మొత్తం ఎందుకు పడిందా అని వారు తెగ ఆలోచించే లోపే అధికారులు బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నారు. ఒక్కో HDFC అకౌంట్‌లో ఒకే సారి 13 కోట్ల 50 లక్షలు జమ అయ్యాయి. దాదాపు వంద మంది కస్టమర్ల ఖాతాల్లో కోట్లు పడ్డాయి. అసలు ఇది నిజమేనా అన్న కొందరు ఏటీఎం కేంద్రాలకు వెళ్లి చెక్ చేసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో HDFC బ్యాంకు ఖాతాదారులు ఒక్కసారి కోటీశ్వరులయ్యారు. HDFC బ్యాంకు అకౌంట్లలోకి కుప్పలు.. తెప్పలుగా డబ్బు వచ్చిపడటం చూసి షాక్ అయ్యారు. చెన్నై, హైదరాబాద్, మెదక్… ఇలా అనేక చోట్ల ఇలా జరిగింది. విషయం తెలుసుకున్న చెన్నైలోని బర్కిట్ రోడ్ HDFC బ్రాంచ్ అధికారులు అలర్ట్ అయ్యారు. దాదాపు వంద ఖాతాలను హోల్డ్ చేశారు. బ్యాంక్ సర్వర్లలో కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది.