హుజూరాబాద్ బై పోల్ ఫీవర్ రోజు రోజుకు పెరుగుతోంది. ఎలక్షన్ డిలే అయినా పార్టీల ప్రచార హోరు ఆగలేదు. పైగా జోరు పెరిగింది. గల్లీ గల్లీలో నేతలు సందడి చేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. చాలా రోజుల క్రితమే అభ్యర్థిని ప్రకటించిన టీఆర్‌ఎస్.. ప్రచారంపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఓపెన్ సీక్రెట్. నూటికి 99 శాతం ఈటలే. ఆ ఒక్క శాతం తేడా వస్తే ఆయన భార్య బరిలో ఉంటారు. అంతకు మించి పెద్ద మార్పు ఉండదు. అందుకే బీజేపీ కూడా గులాబీ దండుకు ఏమాత్రం తీసిపోకుండా జనంలోకి వెళుతోంది. ఎటొచ్చీ..కాంగ్రెస్ మాత్రమే ప్రచారంలో బాగా వెనకబడింది. దానికి కారణం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవటమే.
కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించట్లేదు. గతంలో ఎమ్మెస్సార్ వంటి వారికి కూడా రెబెల్స్ బెడద ఉండేది. అలాంటి స్థితి నుంచి అభ్యర్థిని వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఉనికినే గుర్తించట్లేదు అధికార పార్టీ. కనీసం డిపాజిట్ కూడా రాదని కేటీఆర్ అంటుండగా….తమకు పోటీ బీజేపీ యేనని హరీష్ రావు పదే పదే చెబుతున్నారు. ఈటల కూడా టీఆర్‌ఎస్‌నే టార్గెట్ చేశారు. ఇరు పార్టీల నేతలు పోటీ పోటీగా పంచ్ డైలాగులు వదులుతున్నారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ స్థానం ఏమిటి అన్నది ప్రశ్నగా మారింది.
తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది. అందుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని బావిస్తోంది. కానీ విషయం ఇప్పటి వరకు ఎటూ తేలలేదు. ఎన్నికలు ఆలస్యం అవటంతో హస్తం పార్టీ అభ్యర్థి ప్రకటనలో కూడా డిలే చేస్తోంది. సహజంగాచే కాంగ్రెస్ దేనినీ ఓ పట్టాన తేల్చదు. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో కూడా అదే చేస్తోంది. ఇప్పటి వరకు చాలా పేర్లు తెరమీదకు వచ్చాయి. కానీ ఏదీ నిఖరం కాలేదు. స్తానిక నేతకే అభ్యర్థిత్వం అంటూ దరఖాస్తలును కూడా ఆహ్వానించారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతల జాబితాలను రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ హైకమాండ్ ఏ నిర్ణయమూ చెప్పట్లేదు. అభ్యర్థి విషయంలో ఈ తాత్సరం పార్టీ శ్రేణులను అసహనానికి గురిచేస్తోంది. క్యాండిడేట్ ఎవరో తెలియకుండా ప్రచారంలో జోష్ ఎలా వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొదట హుజూరాబాద్ అభ్యర్థి కొండా సురేఖ అనుకున్నారు. ఆమె అభ్యర్థిత్వం ఫైనల్ అన్నారు. కానీ ఇంతలో సీనియర్లు పేచీ పెట్టారు. కాంగ్రెస్ రెండు గ్రూపులైంది. అభ్యర్థి ఎవరన్నది మళ్లీ మొదటికొచ్చింది. నిజానికి సురేఖకు కూడా ఇక్కడ పోటీ చేయాలన్న ఉత్సాహం ఏమీ లేదు. ఆమెది వరంగల్. 2023 ఎన్నికలకు తిరిగి వరంగల్ వెళ్లాలి. మరి కాంగ్రెస్ నాయకత్వం అందుకు అంగీకరిస్తుందా అన్నది ఆమె అనుమానం. అయితే తనకు పార్టీ నాయకత్వం ఖచ్చితమైన మాట ఇస్తేనే పోటీకి సిద్ధమని ప్రకటించారు. కొండా సురేఖను సరైన అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బావిస్తున్నారు. ఆమె మాత్రమే బీజేపీ, టీఆర్‌ఎస్‌కు టఫ్ ఫైట్ ఇవ్వగలదని ఆయన నమ్మకం. అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా ఈ విషయం ఎటూ తేలలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ లీడర్లు కోమటి రెడ్డి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. దాంతో హుజూరాబాద్ లో అభ్యర్థి ప్రకటన డిలే అవుతూ వస్తోంది.
ఏదేమైనా త్వరలో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్రకటిస్తారని లేటెస్ట్ టాక్. రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి వెనక్కి తగ్గితే ముందు ముందు ఎన్నో కాంప్రమైజ్‌లు తప్పవని రేవంత్‌కు తెలుసు. అందుకే తాను అనుకున్న క్యాండిడేట్‌నే బరిలో దించాలనుకుంటున్నారు. ఇటీవల గజ్వేల్ సభ సక్సెస్ కావటం రేవంత్‌కు ప్లస్ అయిందని పరిశీలకులు అంటున్నారు. రేవంత్ విషయంలో రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే హస్తం పార్టీలో ఎప్పడైనా..ఏదైనా జరగొచ్చు.. అప్పటి దాకా దేనికీ గ్యారంటీ ఉండదని అందరికీ తెలుసు.