NTV Telugu Site icon

Today (13-02-23) Stock Market Roundup: రూ.46,045 కోట్ల అదానీ క్యాష్‌.. మొదటి గంటలోనే మటాష్..

Today (13 02 23) Stock Market Roundup

Today (13 02 23) Stock Market Roundup

Today (13-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్‌ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించలేదు. గ్లోబల్‌ మార్కెట్‌ నుంచి ప్రతికూల సంకేతాలు అందటంతో రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం ఉదయం ఫ్లాట్‌గానే ప్రారంభమై కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇండియా మరియు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ముందుజాగ్రత్త పాటించారు.

అయితే.. సాయంత్రం మార్కెట్‌ ముగిసే ముందు జరిగిన కొన్ని డీల్స్‌ వల్ల కొన్ని నష్టాలనైనా పూడ్చుకోగలిగాయి. మేజర్‌ ఇంజనీరింగ్‌ సంస్థ లార్సెన్‌ అండ్‌ టూబ్రో వంటి కొన్ని కంపెనీల స్టాక్స్‌ కొనుగోళ్లు తాజాగా జరగటంతో ఈ మాత్రమైనా కోలుకోగలిగాయి. అయితే.. మార్కెట్‌ ప్రారంభమైన మొదటి గంటలోనే అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ భారీగా మునిగాయి. దీంతో గ్రూపులోని మొత్తం 9 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆవిరైంది.

Tech Layoffs to Continue: మరికొన్నాళ్లపాటు కొనసాగనున్న టెక్‌ లేఆఫ్‌లు

చివరికి.. సెన్సెక్స్‌ 250 పాయింట్లు కోల్పోయి 60 వేల 431 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. నిఫ్టీ.. 85 పాయింట్లు తగ్గి 17 వేల 770 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో లార్సెన్‌ అండ్‌ టూబ్రో మరియు టైటాన్‌ సంస్థల షేర్లు దాదాపు రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ మరియు సన్‌ ఫార్మా స్టాక్స్‌ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాయి.

బీఎస్‌ఈలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ, లుపిన్‌ తదితర సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీలో ఎఫ్‌ఎంసీజీ మంచి పనితీరు కనబరిచింది. ఐటీసీ, వీబీఎల్‌ స్టాక్స్‌ వ్యాల్యూ బాగా పెరిగింది. మరోవైపు.. ఐటీ ఇండెక్స్‌ 2 శాతం పతనమైంది. కోఫోర్జ్‌ సంస్థ 7 శాతానికి పైగా నేల చూపులు చూసింది.

10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 41 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 56 వేల 700 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు 408 రూపాయలు పడిపోయింది. అత్యధికంగా 66 వేల 256 రూపాయలు పలికింది. క్రూడాయిల్‌ ధర కూడా అత్యంత స్వల్పంగా 34 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్‌ ముడిచమురు 6 వేల 522 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 15 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 75 పైసల వద్ద స్థిరపడింది.