Air india-Vistara: విస్తార ఎయిర్‌లైన్స్.. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనం కానుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ రీసెంట్‌గా ప్రకటించింది. విస్తారలో టాటా గ్రూప్‌కి మెజారిటీ షేరు.. అంటే.. 51 శాతం వాటా ఉండగా మిగతా 49 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిగి ఉంది. ఇదిలాఉండగా.. సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాలో 25 పాయింట్ 1 శాతం షేరును దక్కించుకునేందుకు 2 వేల 58 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనుంది.
ఎయిరిండియా ఇప్పటికే విమానయాన రంగంలోని కీలకమైన అన్ని మార్కెట్ సెగ్మెంట్లలో చెప్పుకోదగ్గ రీతిలో ఉనికిని చాటుకున్న సంగతి తెలిసిందే. అందుకే సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాతో జట్టు కడుతోందని విశ్లేషకులు అంటున్నారు. కాగా.. ఈ విలీన ప్రక్రియను 2024 మార్చి నాటికి పూర్తిచేయాలని సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరియు ఎయిరిండియా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెగ్యులేటరీ సంస్థ అనుమతులన్నీ అనుకున్న సమయానికి లభిస్తే విలీనం సంపూర్ణమవుతుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది.