Aero India 2023: అమృత మహోత్సవం నుంచి అమృత కాలంలోకి ప్రవేశిస్తున్న భారతదేశం మేకిన్ ఇండియా ద్వారా స్థానికంగా ఉత్పత్తులను పెంచుకోవాలని ఆశిస్తోంది. సోవియెట్ కాలం నాటి పరికరాలను ఆధునికీకరించుకోవాలని కృషి చేస్తోంది. దేశీయ విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ మేరకు విదేశీ సంస్థలకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు కూడా పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మన దేశం ప్రతిష్టాత్మకంగా ఏరో ఇండియా-2023 పేరుతో 14వ ఏరో షోను సోమవారం బెంగళూరులో ఘనంగా ప్రారంభించుకుంది. ది రన్‌వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్‌తో ఆరంభమైన ఈ ఈవెంట్.. 5 రోజుల పాటు.. శుక్రవారం వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని భారతదేశం గొప్ప వ్యాపార అవకాశంగా భావిస్తోంది. ప్రస్తుతం ఇండియా 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది.
read more: Loss For Life Insurers: అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్నుల ప్రభావం
ఏరో ఇండియా-2023 షోలో దాదాపు 100 దేశాలకు చెందిన సుమారు 809 కంపెనీలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు. 700కు పైగా లోకల్ ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటారని తెలుస్తోంది. భారతదేశంలో విస్తరిస్తున్న సామర్థ్యాలకు ఈ ప్రదర్శన ప్రత్యక్ష నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇండియాపై ప్రపంచ దేశాలకు మరింత నమ్మకం పెరుగుతోందనటానికి కూడా ఈ షో తిరుగులేని ఉదాహరణని చెబుతున్నారు.
ఏరో ఇండియా-2023 అనేది ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో అని అభివర్ణిస్తున్నారు. 2021-22లో ఇండియా ఒకటిన్నర బిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేసింది. దీన్ని 2024-25లో మూడింతలకు పైగా.. అంటే.. 5 బిలియన్ డాలర్లు దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారు.