సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలు దేరారు. అయితే ప్రభుత్వం 8వ తేది శనివారం నుంచే విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించగా 9వ తేది ఆదివారం ఉదయం నుంచే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా 13 గురువారం కూడా కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా భయాందోళనల నేపథ్యంలో ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
Read Also: రైతులు మరణిస్తున్న కేసీఆర్‌కు సోయి లేదు: షర్మిల
ప్రతి ఏడాది సంక్రాంతికి నగర ప్రజలు సొంత ఊర్లకు వెళ్తుంటారు. ఇక అటు టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. గురువారం రాత్రి నాటికి ట్రాఫిక్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మరోవైపు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ పద్ధతిని అమలు చేస్తుండటంతో కొంత మేర ట్రాఫిక్ కష్టాలు తప్పుతున్నాయి. టోల్ ప్లాజా సిబ్బంది ఫాస్టాగ్ తీసుకోండి సంక్రాంతికి ఫాస్ట్‌గా వెళ్లండి అంటూ ప్రకటనలు సైతం చేస్తున్నారు. ఇక ఫాస్టాగ్ సౌకర్యం లేనివారు ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణీకులు చెబుతున్నారు.