ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోగా నియోజకవర్గం నుండి పోటీ చేసింది. నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకూ తన జీవితాన్ని అంకితం చేసిన సోనూసూద్ ను దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ రాజకీయ అరంగేట్రమ్ చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు కానీ తన సోదరిని రంగంలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగిన మాళవికకు చుక్కెదురైంది.
Read Also : Radhe Shyam’s First show : ఎప్పుడు? ఎక్కడ ?
మోగా నియోజక వర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా విజయం సాధించారు. ఆమెకు యాభై ఎనిమిది వేలకు పైగా ఓట్లు రాగా, సోనూసూద్ సోదరికి 38 వేల ఓట్లు వచ్చాయి. దాంతో ఆప్ అభ్యర్థి ఇరవై వేల మెజారిటీ తో మోగా స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు అయ్యింది. చిత్రం ఏమంటే… పంజాబ్ లో మోగా నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటోంది. 1977 నుండి 2017 వరకూ ఆ పార్టీ ఆరుసార్లు ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది. కానీ ఈసారి మాత్రం ఆప్ ప్రభంజనానికి తట్టుకోలేకపోయింది.