కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ నెల్లూరు జిల్లా వైసీపీలో సెగలు రేపుతోందా? రివెంజ్ పాలిటిక్స్‌కు తెరలేస్తుందా? ప్లేస్‌లు మారతాయే తప్ప.. వర్గపోరు సేమ్ టు సేమ్ అనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయా? ఇంతకీ అక్కడ వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలేంటి? ఎందుకు రుసరుసలు?
పుల్ల విరుపు మాటల వెనక కథేంటి?
సింహపురి వైసీపీ రాజకీయాల్లో రిటర్న్‌గిఫ్ట్‌లు ఉంటాయా? తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ.. ఆప్యాయత చూపించారో.. సహకారం అందించారో అంతకు రెట్టింపు సహాయ సహకారాలు ఉంటాయని… మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఈ ప్రశ్నల చుట్టూనే నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఈ పుల్ల విరుపు మాటలు చూశాక ఇద్దరి మధ్య ఉన్న విభేదాలపై ఆరా తీసేవాళ్లూ ఎక్కువయ్యారు.
కాకాణి, అనిల్ మధ్య ఆధిపత్యపోరు
కేబినెట్ పునర్ వ్యవస్థికరణ తర్వాత పాత మంత్రుల జాబితాలో అనిల్ కుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్దన్‌రెడ్డిని మంత్రిని చేశారు. 2019లోనే కాకాణి మంత్రి పదవి ఆశించినా ఆ సమయంలో అనిల్‌తోపాటు మేకపాటి గౌతంరెడ్డిని మాత్రమే కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇప్పుడు మార్పుల్లో కాకాణికి ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. వాస్తవానికి అనిల్, కాకాణిల మధ్య ఆధిపత్య పోరు ఉందట.
అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు కాలువల మరమ్మతులపై కాకాణి ప్రశ్నలు
అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో నీటిపారుదల సలహాబోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ శాఖ పనితీరుపై ..ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాలువలు మరమ్మతులు చేయకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ సమావేశంలో కాకాణికి మద్దతుగా నిలిచారు ఎమ్మెల్యే ఆనం. దీంతో కాకాని, ఆనంలపై నేరుగా సీఎం జగన్‌కే ఫిర్యాదు చేశారు అనిల్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాకాణి, ఆనంలతో మాట్లాడిన సీఎం జగన్.. సర్దుకుపోవాలని సూచించినట్టు ప్రచారం జరిగింది. అలాగే సర్వేపల్లిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను అట్టహాసంగా నిర్వహించిన కాకాణి.. ఆ సమయంలో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ను ఆహ్వానించారు కానీ.. పక్కనే ఉన్న అనిల్‌ను పిలవలేదు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లోనూ అధికారులను అడ్డంపెట్టుకుని అనిల్‌పై విమర్శలు చేసేవారని గుర్తు చేస్తున్నారు. దీంతో నేతల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా పార్టీ ఇంఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిలు సయోధ్యకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది.
కాకాణి ప్రమాణ స్వీకారం రోజే అనిల్, ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ..!
ఇప్పుడు సీన్ రివర్స్. గత సంగతులను మనసులో పెటుకున్నారో ఏమో కేబినెట్ ప్రమాణ స్వీకారానికి చాలామంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేశారు. కాకాణి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలే వచ్చారు. అదే రోజు ఎమ్మెల్యేలు అనిల్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు ప్రత్యేకంగా భేటీ కావడం చర్చగా మారింది. మంత్రి కాకాణికి ఏ మాత్రం సహకరించకూడదనే రీతిలో చర్చ సాగినట్టు ప్రచారం జరుగుతోంది.
మంత్రిగా కాకాణి జిల్లాలో అడుగు పెట్టకముందే మాటల మంటలు
ఆ ప్రచారాన్ని నిజం చేసేట్టుగా మరుసటి రోజే మాజీ మంత్రి అనిల్ చేసిన కామెంట్స్ ఉన్నాయనేది పార్టీ వర్గాల అభిప్రాయం. గతంలో కాకాణి, ఆనం జట్టుకట్టినట్టే.. ఇప్పుడు అనిల్, ప్రసన్నకుమార్‌రెడ్డి దోస్తీ చేస్తారని అనుకుంటున్నారట. మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కాకాణి సొంత జిల్లాకు రాకముందే ఈ స్థాయిలో మాటల మంటలు రేగడం.. వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఆసక్తి కలిగిస్తోంది. భవిష్యత్ పరిణామాలపై మరింత ఉత్కంఠ రేకిస్తోంది.